శిఖాచౌదరిపై కేసు నమోదు

26 Feb, 2019 00:57 IST|Sakshi
శిఖాచౌదరిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జయరామ్‌ మామ పిచ్చయ్యచౌదరి, శిఖాచౌదరి

జయరామ్‌ భార్య పద్మశ్రీ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు 

ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి పత్రాలు ఎత్తుకెళ్లిందని, బెదిరింపులకు పాల్పడుతోందని కేసు

హైదరాబాద్‌: చిగురుపాటి జయరామ్‌ హత్య కేసుకు సంబంధించి ఆయన మేనకోడలు శిఖా చౌదరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. తన భర్తను హత్య చేసినరోజు రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–44లోని తన ఇంట్లోకి శిఖాచౌదరి దౌర్జన్యంగా ప్రవేశించి బీరువాలోంచి పత్రాలు ఎత్తుకెళ్లిందని, తనను బెదిరింపులకు గురిచేస్తోందని ఆయన భార్య పద్మశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆధారాలివ్వాలని పోలీసులు సూచించడంతో పద్మశ్రీ తండ్రి పిచ్చయ్యచౌదరి ద్వారా సోమవారం పలు ఆధా రాలు అందజేశారు. జయరామ్‌ మరణవార్త విన్న వెం టనే ఆయన ఇంటికి వెళ్లానని, అక్కడున్న తన ప్రాజెక్టు  కాగితాలు తీసుకున్నానని, ఆ సమయంలో వాచ్‌మన్‌నూ లోపలకు తీసుకువెళ్లానని పోలీసుల విచారణలో శిఖాచౌదరి అంగీకరించారు.

ఆమె డ్రైవర్, పనిమనిషి, వాచ్‌మన్‌ను విచారించిన అనంతరం ప్రధాన నింది తుడు రాకేష్‌రెడ్డినీ శిఖాచౌదరితో సంబంధాలపై ఆరా తీశారు. జయరామ్‌ హత్య ఘటనలో శిఖాచౌదరి పాత్ర ఉందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె తనను బెదిరిస్తోందని, పలువురితో ఫోన్లు చేయించి భయభ్రాంతులకు గురిచేయిస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాల ని కోరుతూ పద్మశ్రీ మరోమారు పోలీసులను ఆశ్ర యించారు. ఈ మేరకు పద్మశ్రీ తండ్రి ద్వారా జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలోనే శిఖాచౌదరిపై తాజాగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

టీడీపీ నేత రెండోరోజూ విచారణ 
జయరామ్‌ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌తో సన్ని హిత సంబంధాలు ఉండటమే కాకుండా పలు సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్‌ నేత, తెలంగాణ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌ పోలీసులు రెండోరోజైన సోమవారమూ విచారించారు. బంజారాహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో 3 గంటలపాటు ఆయన్ను విచారించారు. రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు రాకేశ్‌రెడ్డిని తీసుకొని వెళ్లడానికి కారణాలేమిటి? జయరామ్‌తో సెటిల్‌మెంట్‌ గురించి ఏం చెప్పాడు? అని ప్రశ్నిం చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో రాకేశ్‌ పరిచయమయ్యాడని, ఖైరతాబాద్‌ సీటు ఇప్పిస్తానని ఆశచూపాడని బీఎన్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు.

గత నెల 30న జయరామ్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–10లోని రాకేశ్‌రెడ్డి ఇంటికి వచ్చినప్పుడు మీరూ అక్కడ ఉన్నారట కదా? అని ప్రశ్నించగా తాను ఆ రోజు వెళ్లలేదని బీఎన్‌రెడ్డి చెప్పాడు. హత్య జరగడానికి ఒకరోజు ముందు జయరామ్‌ను బెదిరించేందుకు, రూ.4.50 కోట్ల వ్యవహారం సెటిల్‌మెంట్‌ చేసేందుకు బీఎన్‌రెడ్డి వెళ్లినట్లుగా ఉన్న ఆధారాలు చూపడంతో ఆయన ఖిన్నుడైనట్లు తెలిసింది. తనకు జయరాం రూ.4.50కోట్లు ఇవ్వాలని, వాటిని వసూలు చేసి పెడితే ఎన్నికల ఖర్చులకు రూ.2 కోట్లు ఇస్తానని రాకేష్‌ చెప్పడంతో సెటిల్‌మెంట్‌కు బీఎన్‌రెడ్డి ముందు కొచ్చాడని తెలుస్తున్నది. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాలని బీఎన్‌రెడ్డికి పోలీసులు స్పష్టం చేశారు. ఇతర రాజకీయ పార్టీల నేతలెవరైనా రాకేష్‌తో పరిచయాలు కలిగి ఉన్నారా? అని కూడా పోలీసులు ఆరా తీశారు. మొత్తానికి ఈ కేసు కొత్త రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు