సుమన్‌కు సెగ

13 Sep, 2018 02:55 IST|Sakshi
ఘటనా స్థలంలో గుమిగూడిన ప్రజలు

     ప్రచారం ప్రారంభంలో అపశ్రుతి  

     ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న ఓదెలు అనుచరుడు గట్టయ్య..

     బాల్క సుమన్‌ టార్గెట్‌గా పెట్రోల్‌ చిమ్మినట్లు కేసు నమోదు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఎంజీఎం:  మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సుమన్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరుడు రేగుంట గట్టయ్య ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జైపూర్‌ మండలం ఇందారం నుంచి తొలిసారిగా ప్రచారం ప్రారంభించేందుకు బుధవారం నియోజకవర్గానికి వచ్చిన సుమన్‌కు స్వాగతం పలికే సందర్భంలో పెనుప్రమాదం తప్పింది. సుమన్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ గట్టయ్య ఒంటి మీద పెట్రోల్‌ పోసుకోవడంతో పాటు సుమన్‌పైకి చిమ్మేందుకు చేసిన ప్రయత్నంలో మంగళహారతులపై పడి మంటలు రేగాయి. దీంతో గట్టయ్యతో పాటు 16 మందికి గాయాలయ్యాయి. సుమన్‌పై పెట్రోలు పడకుండా శ్రీరాంపూర్‌ సీఐ నారాయణనాయక్, సుమన్‌ అనుచరుడు జైనుద్దీన్‌ అడ్డుగా నిలిచారు. తీవ్రంగా గాయపడ్డ గట్టయ్యను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సీఐ నారాయణనాయక్, ఫొటోగ్రాఫర్లు అనీష్, శ్రీకాంత్‌లను మంచిర్యాల లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

పథకం ప్రకారమేనా..!: చెన్నూర్‌లో ప్రచారానికి సుమన్‌ బుధవారం ఉదయం 11.40కు ముహూర్తం నిర్ణయించుకున్నారు. డీఎంఎఫ్‌ నిధులతో ఇందారం గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వెళ్లారు. మహిళలు సుమన్‌కు హారతి పట్టేందుకు రాగా, అక్కడికి చేరుకున్న ఇందారం గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నేత గట్టయ్య చేతిలో పెట్రోల్‌ సీసాతో ప్రత్యక్షమయ్యాడు. ఏం జరుగుతుందో తెలిసేలోగానే ‘జై కేసీఆర్‌.. జై ఓదెన్న’అని నినాదాలు చేస్తూ పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. గట్టయ్య తన నోట్లో పడ్డ పెట్రోల్‌ను సుమన్‌పైకి ఉమ్మినట్లు సాక్షులు చెబుతున్నారు. మంగళహారతులపై పెట్రోల్‌ పడటంతో మంటలు రేగాయి. గట్టయ్య కాలిపోతూ పరిగెత్తుతుండగా పోలీసులు మంటలు ఆర్పే ప్ర యత్నం చేశారు. ఘటనను సుమన్‌పై జరిగిన హత్యాయత్నంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

నాపై జరిగిన హత్యాయత్నం: బాల్క సుమన్‌ 
తనపై జరిగిన హత్యాయత్నంలో భాగంగానే ఓదెలు వర్గం పెట్రోల్‌తో దాడి చేసిందని బాల్క సుమన్‌ ఆరోపించారు. చెన్నూర్‌ టికెట్‌ను కేసీఆర్‌ తనకు కేటాయించారని.. ఎవరు అడ్డుపడినా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

సుమన్‌వి నీచరాజకీయాలు: ఓదెలు 
బాల్కసుమన్‌ నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోరారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గట్టయ్యను ఓదెలు పరామర్శించారు.

మరిన్ని వార్తలు