‘నారాయణ’ సిబ్బందితో నగదు పంపిణీ!

25 Mar, 2019 03:29 IST|Sakshi
ఎస్సైతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌. (ఇన్‌సెట్‌లో) నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డి

నెల్లూరు నగరంలో పెద్దఎత్తున ప్రలోభాలకు శ్రీకారం

సిబ్బంది ద్వారానే నజరానాల అందజేత

డబ్బులతో స్థానికులకు చిక్కిన సంస్థ ఏజీఎం

నిందితులు పోలీసులకు అప్పగింత

స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపేయాలని పోలీసులపై ఒత్తిడి

సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌ డిమాండ్‌

నెల్లూరు (క్రైమ్‌): ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు తెరలేపారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు రాబట్టుకు నేందుకు భారీ నజరానాలు ముట్టజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ.. రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. వారు బృందాలుగా విడిపోయి నగర నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో గత కొద్ది రోజులుగా మకాంవేసి ఓట్ల సర్వే నుంచి నగదు పంపిణీ వరకు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఓటర్లకు కోట్లాది రూపాయల నగదు పంపిణీ వీరి ద్వారా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆదివారం ‘నారాయణ’ సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి 43వ డివిజన్‌లోని జెండా వీధి, కుమ్మర వీధి ప్రాంతాల్లో నగదు పంపిణీకి చర్యలు చేపట్టారు.

ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కుమ్మర వీధిలోని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నగదు లెక్కిస్తున్న వారిని పట్టుకున్నారు. వీరిలో ఓ వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వారిలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రమణారెడ్డితోపాటు మరో ఉద్యోగి సమ్మద్‌ ఇంకొకరున్నారు. ఈ విషయమై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు సమాచారం అందించారు. స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ రాజేంద్రకుమార్‌సింగ్‌ వీరి నుంచి రూ.8.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆ ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పరారైన వ్యక్తి వద్ద రూ.35 లక్షలు ఉన్నట్లు సమాచారం. కాగా, టీడీపీ నేతల తప్పుడు ఆరోపణల విచారణకే సమయం కేటాయిస్తున్న నగర పోలీసులు తాయిలాల పంపిణీలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా టీడీపీ నేతలు, అనుచరులు, సానుభూతిపరులు నగదు పంచుతూనో, తాయిలాలు పంచుతూనో దొరికిపోతే మాత్రం వారి వివరాలను ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. 

పోలీసులపై ఒత్తిడి
ఇదిలా ఉంటే, టీడీపీ నేత పట్టాభిరామిరెడ్డి తన అనుయాయులను పోలీస్‌స్టేషన్‌కు పంపి తమ వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అందుకు రంగం సిద్ధంచేశారు. నిజానికి ఎన్నికల సమయంలో వీరు నగదుతో దొరికినందున ఈ సమాచారాన్ని ముందుగా ఎన్నికల సంఘానికి తెలిపి వారి ఆదేశాలతో కేసు నమోదు చేసి నగదు మూలాలను గుర్తించాలి. కానీ, ఇక్కడ మంత్రి పలుకుబడితో.. పట్టుబడిన వారికి వెంటనే బెయిల్‌ ఇచ్చేలా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నోటు పంపిణీ విషయంపై సమాచారం అందుకున్న నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని విచారణను నిష్పక్షపాతంగా జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ షేక్‌ కరీముల్లాను కోరారు.  

మరిన్ని వార్తలు