క్రికెట్‌ బెట్టింగ్‌తో.. బ్యాంక్‌కు క్యాషియర్‌ కన్నం

22 Aug, 2019 06:43 IST|Sakshi
మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసులు  

క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పులపాలైన ఉద్యోగి

బ్యాంక్‌లో రోజూ కొంతమొత్తంలో చోరీ

పోలీసులకు మేనేజర్‌ ఫిర్యాదు, నిందితుడి అరెస్ట్‌

సాక్షి, కోవూరు: ‘అతను బ్యాంక్‌లో క్యాషియర్‌. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా అప్పులపాలయ్యాడు. ఈక్రమంలో పనిచేస్తున్న బ్యాంక్‌కే కన్నం వేశాడు. ఈ వ్యవహారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. వివరాలను బుధవారం కోవూరు సీఐ జీఎల్‌ శ్రీనివాసులు స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. మండల కేంద్రమైన అల్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దోసరి నాగబాబు సుమారు మూడేళ్లుగా క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అల్లూరులోనే నివాసం ఉంటున్నాడు. అతడికి క్రికెట్‌ బెట్టింగ్‌ అలవాటు ఉంది. పెద్ద మొత్తంలో నగదు పోయింది. ఈక్రమంలో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంక్‌కే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ నాగబాబు, కస్టోడియన్‌ మునిస్వామిలు సాయంత్రం లెక్క చూసి లాకర్‌లో డబ్బు పెట్టాలి.

లాకర్‌ నుంచే నగదు చోరీ చేయాలని భావించిన నాగబాబు మునిస్వామిని నమ్మించడం ప్రారంభించాడు. నగదు పెట్టే సమయంలో కస్టోడియన్‌ను ఏమార్చి లెక్క మొత్తం సరిపోయిందని చెప్పేవాడు. అదే సమయంలో కొంత నగదు, బంగారు ఆభరణాలు తీసి బ్యాంక్‌లో దాచిపెట్టేవాడు. ఈవిధంగా కొద్దిరోజులపాటు జరిగింది. ఈనెల 16వ తేదీన కస్టోడియన్‌ బ్యాంక్‌కు వెళ్లి నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలు చూడగా తేడా వచ్చింది. ఈక్రమంలో మేనేజర్‌ రవించంద్రకు చెప్పాడు. వారు సీసీ టీవీ ఫుటేజీ చూశారు. అందులో నాగబాబు పలుమార్లు నగదు, ఆభరణాలు తీసుకెళ్లినట్లుగా రికార్డైంది. దీంతో మేనేజర్‌ అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రఘునాథ్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

నాగబాబు కస్టోడియన్‌ను ఏమార్చి రూ.5.40 లక్షలు, కొంత బంగారు ఆభరణాలు (మొత్తం కలిపి రూ.6.32 లక్షలు) చోరీ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. బుధవారం నిందితుడు నాగబాబు అల్లూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఉండగా అరెస్ట్‌ చేశారు. అతని వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇందులో కస్టోడియన్‌ పాత్ర లేదని, అతడిని నమ్మించి నాగబాబు నగదు, ఆభరణాలు అపహరించాడని పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును త్వరగా ఛేదించిన పోలీస్‌ సిబ్బంది యానాదయ్య, మురళి, వేణు, గౌస్‌బాషా, తిరుపతిస్వామి, దశరథ్, చంద్రలను సీఐ అభినందించారు. కేసును జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి, కేవీ రాఘవారెడ్డి పర్యవేక్షణలో ఛేదించామన్నారు.

మరిన్ని వార్తలు