క్యాట్‌ఫిష్‌ అక్రమ రవాణా

17 Jan, 2018 04:04 IST|Sakshi

గుట్టురట్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు

44 బాక్సుల క్యాట్‌ఫిష్‌ సీడ్‌ స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌ : నిషేధిత క్యాట్‌ఫిష్‌ పిల్లల (సీడ్‌) అక్రమ రవాణా గుట్టును శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు రట్టు చేశారు. మంగళవారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 44 బాక్సుల్లో పార్శిల్‌ చేసిన లక్ష క్యాట్‌ఫిష్‌ సీడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య కారకం కావడంతో భారతదేశంలో క్యాట్‌ఫిష్‌ పెంపకంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ నుంచి ఈ సీడ్‌ను కర్ణాటకలోని బీదర్‌కు చెందిన స్మగ్లర్లు ఖరీదు చేస్తున్నారు. దీన్ని నేరుగా బంగ్లాదేశ్‌ నుంచి బీదర్‌కు తరలించే ఆస్కారం లేదు.

ప్యాకెట్లలో ఉన్న ఈ సీడ్‌కు ప్రతి నాలుగు గంటలకూ ఒకసారి ఆక్సిజన్‌ అందిస్తూ ఉండాలి. 12 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చి చెరువులో వదిలేయాలి. దీంతో స్మగ్లర్లు ఈ సీడ్‌ను తొలుత బంగ్లాదేశ్‌ నుంచి కోల్‌కతాకు తీసుకువస్తున్నారు. అక్కడ నుంచి ప్యాసింజర్‌ ఫ్లైట్‌లో లైవ్‌ ఫిష్‌ పేరుతో కార్గో బుక్‌ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌కు తీసుకువచ్చిన తర్వాత రోడ్డు మార్గంలో బీదర్‌కు తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు కస్టమ్స్‌ అధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) అధికారులు మంగళవారం ఇండిగో ప్యాసింజర్‌ ఫ్లైట్‌ కార్గోలో బుక్‌ చేసిన 44 కార్టన్‌ బాక్సుల్ని తనిఖీ చేశారు. ఇందులో క్యాట్‌ఫిష్‌ సీడ్‌ బయటపడటంతో రవాణా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ.మూడు లక్షలు ఉంటుందని, పెరిగిన తర్వాత రేటు కొన్ని రెట్లు పెరుగుతుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా