సీబీఐ అధికారులమంటూ లంచాలు.. అరెస్ట్‌

18 Jan, 2020 20:40 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ :  సీబీఐ  ఉన్నతాధికారుల పేరుతో లంచాలు డిమాండ్‌ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై జనవరి 16న కేసు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్‌ వాసితో పాటు మధురైకి చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌కు చెందిన మణివర్ధన్‌ రెడ్డి, మధురైకి చెందిన సెల్వం రామరాజ్‌.. బ్యాంకు మోసం కేసుల్లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న నిందితులను కలిసి తాము సీబీఐ సీనియర్‌ అధికారులుగా పరిచయం చేసుకునేవారు. అంతేకాకుండా సీబీఐ న్యూఢిల్లీ కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తున్నట్లు సాఫ్ట్‌వేర్‌ తయారీ చేసి ఫోన్‌ కాల్స్‌ చేసేవారు.

కేసులు నుంచి తప్పించేందుకు సహకరిస్తామని ఆశ చూపించి, అందుకుగానూ లంచాలు ఇవ్వాలని డిమాండ్‌ చేయసాగారు. లంచం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో బ్యాంక్‌ కేసు ఆరోణపలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఆగంతకులు బెదిరించారు. దీనిపై పిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు చెన్నైలో రెండుచోట్ల, హైదరాబాద్, మధురై, శివకాశిల్లో ఒక చోట తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనేక మొబైల్‌ ఫోన్లు, నేరానికి సంబంధించి వాట్సాప్‌ సంభాషణలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ శనివారం వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు