అక్రమబంధంపై సీబీఐ

1 Jan, 2020 04:36 IST|Sakshi

పోలవరం ఒప్పందం పేరుతో రూ.794 కోట్ల

రుణం పొందిన ట్రాన్స్‌ట్రాయ్‌ 

అందులో రూ.250 కోట్లు ‘పెద్దబాబు’ జేబులోకి! 

బ్యాంకులకు బకాయిలు

చెల్లించకుండా మొండికేసిన రాయపాటి సంస్థ

సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియానికి రూ.794 కోట్ల రుణం ఎగ్గొట్టిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై కేసు నమోదు చేసిన సీబీఐ మంగళవారం గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లోని ఆయన ఇళ్లలో సోదాలకు దిగడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ట్రాన్స్‌ట్రాయ్‌ రుణం తిరిగి చెల్లించకుండా మొండికేస్తోందని, వసూలుకు సహకరించాలని 2015 జూలై 31వతేదీన 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం చేసిన అభ్యర్థనను నాటి సీఎం చంద్రబాబు తోసిపుచ్చడం వెనుక లోగుట్టును బహిర్గతం చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. ఆర్బీఐ నిబంధనలనను ఉల్లంఘించి పోలవరం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌కి బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించడంపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ని వీడి టీడీపీలో చేరిన రాయపాటి పోలవరం కాంట్రాక్టు ఒప్పందాన్ని చూపించి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.250 కోట్లకుపైగా చంద్రబాబుకు ముట్టచెప్పారన్న అంశంపై సీబీఐ క్షుణ్నంగా దర్యాప్తు జరుపుతోంది. 

ఒప్పందాన్ని చూపించి రుణం
పోలవరం హెడ్‌వర్క్స్‌ను రూ.4,054 కోట్లకు దక్కించుకున్న టాన్స్‌ట్రాయ్‌–జేఎస్‌సీ–యూఈఎస్‌(జేవీ) 2013 మార్చి 2న నాటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో విదేశీ సంస్థలైన జేఎస్‌సీ, యూఈఎస్‌ వాటా 87 శాతం కాగా రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ వాటా కేవలం 13 శాతం మాత్రమే. ఈ ఒప్పందాన్ని చూపించి 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.794 కోట్ల రుణాన్ని తీసుకుంది. చిన్న తరహా ప్రాజెక్టుల పనులే చేయలేని ట్రాన్స్‌ట్రాయ్‌కి ఏకంగా 194.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న పోలవరం పనులను ఎలా అప్పగిస్తారని అప్పట్లో విపక్షాలు ఆందోళన చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాయపాటి భారీగా ముడుపులు ఇవ్వడం వల్లే ట్రాన్స్‌ట్రాయ్‌కి పోలవరం కాంట్రాక్టు దక్కిందంటూ నాడు కూడా ప్రతిపక్ష నేతగానే ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరిన రాయపాటి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.250 కోట్లకుపైగా చంద్రబాబుకు ముట్టచెప్పినట్లు టీడీపీ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి.  

ట్రాన్స్‌ట్రాయ్‌ని కాపాడేందుకు కేబినెట్‌ భేటీ..
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌పై కేంద్రం వేటు వేస్తుందని గుర్తించిన చంద్రబాబు 2015 అక్టోబర్‌ 10న కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. 2010–11 ధరల ప్రకారం అప్పగించిన పోలవరం పనులు గిట్టుబాటు కావని, హెడ్‌వర్క్స్‌ను 2018 నాటికే పూర్తి చేయాలంటే 2015–16 ధరలను వర్తింపజేసి అంచనా వ్యయాన్ని పెంచాలని అందులో తీర్మానించారు. ఈ క్రమంలోనే పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రాన్ని పదేపదే అభ్యర్థించారు. చివరకు 2016 సెప్టెంబరు 7న ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం గత ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజే హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,385.91 కోట్లకు పెంచేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం గడువు ముగియకుండానే నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.1,331.91 కోట్ల లాభాన్ని చేకూర్చింది. ట్రాన్స్‌ట్రాయ్‌ని ముందు పెట్టి పోలవరం పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించిన చంద్రబాబు బిల్లులు చెల్లించే సమయంలోభారీగా కమీషన్లు వసూలు చేసుకున్నారు.

కమీషన్ల కోసం కన్సార్షియం కన్నుగప్పి..
పోలవరం హెడ్‌వర్క్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌ చేసిన పనులకు 2018 జనవరి వరకు రూ.2,362.22 కోట్లను బిల్లుల రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం ఈ బిల్లులు చెల్లింపు లావాదేవీలు 14 జాతీయ బ్యాంకుల కన్సార్షియం కనుసన్నల్లోనే జరగాలి. అయితే బ్యాంకుల కన్సార్షియం ద్వారా చెల్లింపులు జరిపితే ట్రాన్స్‌ట్రాయ్‌ తీసుకున్న రుణాన్ని మినహాయించుకుని మిగతా బిల్లులను మాత్రమే బ్యాంకులు చెల్లిస్తాయి. ఇలాగైతే కమీషన్లు రావని ట్రాన్స్‌ట్రాయ్‌కి రుణం ఇచ్చిన 14 బ్యాంకుల కన్సార్షియం ద్వారా కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లించాలని పే అండ్‌ అకౌంట్స్‌ విభాగంపై నాడు చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో బ్యాంకుల కన్సార్షియం కన్నుగప్పి ఇతర బ్యాంకుల ద్వారా దొడ్డిదారిలో ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించారు. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈ అండ్‌ వై) ద్వారా జాతీయ బ్యాంకుల కన్సార్షియం నిర్వహించిన ఆడిటింగ్‌లో ఇదే విషయం వెల్లడి కావడంతో దీనిపై సీబీఐకి నివేదించింది. 

రసీదులు లేకుండా చెల్లింపులు..
పోలవరం హెడ్‌వర్క్స్‌ సీఈ, ఎస్‌ఈల నేతృత్వంలో ప్రత్యేక నిధి ఉంటుంది. డీజిల్, పెట్రోల్‌ కొనుగోలు, యంత్రాల మరమ్మతులు, కూలీల వేతనాల చెల్లింపు కోసమే ప్రత్యేక నిధిని వినియోగించాలి. ఈమేరకు కాంట్రాక్టర్‌ రసీదులు చూపితేనే ప్రత్యేక నిధి ద్వారా చెల్లింపులు చేయాలి. అనంతరం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే సమయంలో ప్రత్యేక నిధి ద్వారా చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేయాలి. అయితే ట్రాన్స్‌ట్రాయ్‌ ఎలాంటి రసీదులు చూపకున్నా ప్రత్యేక నిధి కింద రూ.170 కోట్లను చెల్లించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం ద్వారా ఎలాగోలా మొబిలైజేషన్‌ అడ్వాన్సులను అధికారులు వసూలు చేయగలిగారు కానీ ప్రత్యేక నిధి ద్వారా చేసిన చెల్లింపులను మాత్రం రికవరీ చేయలేకపోయారు. 
- పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్‌ట్రాయ్‌కి హెడ్‌వర్క్స్‌ పనులను చేసే సత్తా లేదని 2015 మార్చి 12న పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో అప్పటి సీఈవో దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. 
ట్రాన్స్‌ట్రాయ్‌కి ఎక్కడా లేని రీతిలో కాంట్రాక్టర్‌ రోజువారీ ఖర్చులు అంటే డీజిల్, పెట్రోల్, యంత్రాల మరమ్మతులు, కూలీల వేతనాల చెల్లింపు కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక నిధి (స్పెషల్‌ ఇంప్రెస్ట్‌ అమౌంట్‌) ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 
తొలుత రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధిని అంచెలంచెలుగా పలు జీవోలతో రూ.170 కోట్లకు పెంచేసిన నాటి సీఎం చంద్రబాబు ట్రాన్స్‌ట్రాయ్‌కి భారీ ప్రయోజనం చేకూర్చారు. 
- అధికారులు తీవ్రంగా ప్రయత్నించి అందులో రూ.26 కోట్లను తిరిగి రాబట్టగలిగినా కాంట్రాక్టర్‌ నుంచి మిగతా డబ్బులను తిరిగి వసూలు చేయకుండా చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు.

పత్తాలేని విదేశీ సంస్థలు..
పోలవరం పనులు దక్కించుకుని ఒప్పందం చేసుకున్నాక విదేశీ సంస్థలైన జేఎస్‌సీ, యూఈఎస్‌ పత్తా లేవు. అంటే కేవలం ఈ కాంట్రాక్టు పనులను దక్కించుకునేందుకు అవసరమైన సాంకేతిక సహకారం కోసమే విదేశీ సంస్థలను ట్రాన్స్‌ట్రాయ్‌ కాగితాలపై చూపినట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేయాలని 2014లోనే జలవనరులశాఖ ఉన్నతాధికారులు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) కూడా 2015 మార్చి 12న తొలి సారిగా నిర్వహించిన సమావేశంలో ట్రాన్స్‌ట్రాయ్‌ జేవీలో విదేశీ సంస్థలు జాడ లేకపోవటాన్ని ప్రశ్నించింది. పనుల్లో ఏ మాత్రం ప్రగతి లేకపోవడాన్ని ఆక్షేపించింది. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి రుణం వసూలుకు సహకరించాలని జాతీయ బ్యాంకుల కన్సార్షియం చేసిన అభ్యర్థనను నాటి సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు.  

>
మరిన్ని వార్తలు