ప్రియాంక గాంధీ సన్నిహితురాలికి సీబీఐ షాక్‌

14 Dec, 2019 13:31 IST|Sakshi

ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, పద్మశ్రీ లీలా శాంసన్‌కు సీబీఐ షాక్

ఆర్థిక అవకతవకల ఆరోపణలు, పలువురిపై కేసులు  

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ భరత నాట్యం కళాకారిణి, సంగీత నాటక​ అకాడమీ మాజీ  చైర్‌పర్సన్‌ లీలా శాంసన్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అవినీతి ఆరోపణలతో ఆమెతోపాటు అప్పటి అధికారులపై సీబీఐ అవినీతి, క్రిమినల్, కుట్ర  కేసులు నమోదు చేసింది.  ఈ మేరకు సీబీఐ అధి​కారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

చెన్నై కళాక్షేత్ర ఫౌండేషన్ కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ సమయంలో అవినీతి జరిగిందనేది ప్రధాన అభియోగం. లీలా శాంసన్‌ హయాంలో రూ.7.02 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఓపెన్ టెండర్ విధానాన్ని అనుసరించకుండా కాంట్రాక్టర్లకు నామినేషన్ ప్రాతిపదికన ఎక్కువ రేటుకు కాంట్రాక్టు పనులు అప్పగించారని కంప్ట్రోలర్  అండ్‌ ఆడిటర్ జనరల్‌ తేల్చింది. ఆర్థిక కమిటీ అధికారిక అనుమతి లేకుండా పునరుద్ధరణ పనులు జరిగాయని తెలిపింది. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో 2017 లో సంబంధిత  మంత్రిత్వ శాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది.

దీంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, సెన్సార్ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా పనిచేసిన లీలా శాంసన్‌తో పాటు అప్పటి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్‌ మూర్తి, అకౌంట్స్ ఆఫీసర్ రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ వీ శ్రీనివాసన్, కన్సల్టెంట్ సెంటర్ ఫర్ ఆర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ (కార్డ్‌) సంస్థ యజమాని, చెన్నై ఇంజనీర్లపై కేసు నమోదైంది. పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును జనరల్ ఫైనాన్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫౌండేషన్ అధికారులు కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ కార్డ్‌కు ప్రదానం చేశారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనవసర ఖర్చులతో పాటు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా దాచి పెట్టారని ఆరోపించారని సీబీఐ అధికారులు వెల్లడించారు.

కాగా 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను కళాక్షేత్ర డైరెక్టర్‌గా నియమించింది. తరువాత ఆగస్టు 2010లో సంగీత నాటక అకాడమీ ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఆ తరువాత ఏప్రిల్ 2011లో బాలీవుడ్ సహా దేశీయ సినిమాలను సెన్సార్ చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు ఛైర్మన్‌గా లీలా శాంసన్‌ నియమితులయ్యారు. మరోవైపు లీలా శాంసన్‌ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా భావిస్తారు. ప్రియాంకగాంధీకి కొన్నేళ్లపాటు భరతనాట్యం నేర్పించినట్టుగా చెబుతారు. ఈ నేపథ్యంలోనే యూపీఏ పాలనలో పదేళ్లపాటు ఆరు కీలక పదవులను కట్టబెట్టారన్న విమర్శలున్నాయి.  దీంతో లీలా శాంసనపై బీజేపీ ప్రభుత‍్వం సీబీఐ విచారణకు జరిపించాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది.

మరిన్ని వార్తలు