వరంగల్‌ డీసీసీబీ అక్రమాలపై సీబీ సీఐడీ విచారణ

23 Jan, 2020 04:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్విని యోగంపై సీబీ సీఐడీ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు డీజీపీ (సీఐడీ) ఈ కేసు విచారించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్‌ డీసీసీబీలో బంగారం తాకట్టు లేకుండానే రుణాలు ఇవ్వడంతో పాటు నిధులు దుర్వినియోగమైనట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.

దీంతో 2017లో వరంగల్‌ డీసీసీబీలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేయడంతో సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్‌ విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదికను సమర్పిం చారు. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, దాదాపు రూ.9 కోట్ల వరకు నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.7 కోట్లు బ్యాంకు క్యాష్‌ను అక్రమంగా వాడినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని నివేదికలో సూచించారు. పరిశీలించిన ప్రభుత్వం డీసీసీబీ కమిటీని ఇప్పటికే రద్దు చేసింది. తాజాగా అసలు అక్రమార్కులు ఎవరో తేల్చడంతోపాటు, నిధుల రికవరీ చేపట్టేందుకు సీబీ సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది

మరిన్ని వార్తలు