ఉన్నావ్‌ కేసు : సీబీఐ అదుపులో బీజేపీ ఎమ్మెల్యే

13 Apr, 2018 08:52 IST|Sakshi

సాక్షి, లక్నో : లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను సీబీఐ శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. ఉన్నావ్‌లో 16 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కేసులో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సెంగార్‌పై కిడ్నాపింగ్‌, లైంగికదాడి, నేరపూరిత కుట్ర, పోస్కో చట్టాల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు సెంగార్‌ను అరెస్ట్‌ చేయకపోవడంపై అలహాబాద్‌ హైకోర్టు సైతం యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యేను ఇంతవరకూ ఎందుకు అరెస్ట్‌ చేయలేదని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలినట్టు కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే బాధితులెవరైనా ఇక ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారా అని నిలదీసింది. గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యే ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఇంటి వద్ద ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మరోవైపు తనపై లైంగిక దాడి ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే సెంగార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు