అయేషా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం

24 Apr, 2019 17:31 IST|Sakshi

విజయవాడ: అయేషా మీరా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా అయేషా మీరా హత్య సమయంలో పనిచేసిన పోలీసులను సీబీఐ అధికారులు విచారించారు. కానిస్టేబుళ్లు రామారావు, శంకర్‌, రాధాల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తు తీరు, గుర్తించిన ఆధారాల గురించి వివరాలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఘటనాస్థలంలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ నివేదిక సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఇప్పటికే సీబీఐ, విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో అనుమానాస్పద స్థితిలో కాలిపోయాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును హైకోర్టు, సీబీఐకి అప్పగించిన విషయం తెల్సిందే.

2007 డిసెంబర్‌ 27న బీ-ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్లో హత్యకు గురైంది. హాస్టల్లో ఉన్న బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉన్న అయేషాను  హాస్టల్‌ సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. తన ప్రేమను తిరస్కరించడంతోనే అయేషాపై అత్యాచారం జరిపి చంపేసినట్లు నిందితుడు లేఖ రాసి ఆమె పక్కన పడేసి వెళ్లాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉంది. చివరికి సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా కేసు ఓ కొలిక్కిరాలేదు.

మరిన్ని వార్తలు