మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు

30 May, 2018 12:27 IST|Sakshi
ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ నివాసంలో బుధవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్రియేటివ్‌ టీమ్‌ను నియమించుకున్న సమయంలో పలు అవకతవలకు పాల్పడ్డారన్న కారణంగా దాడులు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు ప్రారంభించిన వెంటనే సత్యేందర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి క్రియేటివ్‌ టీమ్‌ నియమించుకున్న కారణంగా సీబీఐ అధికారులు నా ఇంటిలో సోదాలు చేశారు. విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాజెక్టుల కోసం నియమించుకున్న అధికారులను ప్రస్తుతం వదులుకోవాల్సి వస్తోందని’  సత్యేందర్‌ ట్వీట్‌ చేశారు.

ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా స్పందించారు. ‘ప్రధాని మోదీ అసలు ఏం కోరుకుంటున్నారంటూ’ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. కాగా సత్యేందర్‌.. అరవింద్‌ కేజ్రీవాల్‌ కేబినెట్‌లో శక్తివంతుడైన మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైద్యశాఖతో పాటు పరిశ్రమలు, పీడబ్ల్యూడీ, విద్యుత్‌, కుటుంబ సంక్షేమ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

మరిన్ని వార్తలు