సీసీ కెమెరాలే కీలకం

6 Sep, 2018 11:50 IST|Sakshi

నిజాం మ్యూజియం చోరీ కేసుపై ముమ్మర దర్యాప్తు

15 ప్రత్యేక బృందాల ఏర్పాటు

సీసీ కెమెరాల çఫుటేజీ పరిశీలన

హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం నగర సీసీఎస్‌ పోలీసులు మరోసారి మ్యూజియంలో
తనిఖీలు నిర్వహించారు.

యాకుత్‌పురా: హెచ్‌ఈహెచ్‌ నిజాం మ్యూజియంలో జరిగిన చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నగర సీసీఎస్‌ పోలీసులు మరోసారి మ్యూజియంలో తనిఖీలు నిర్వహించారు. చోరీ జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. విలువైన వెలకట్టలేని వస్తువులు భద్రపరిచిన మ్యూజియానికి సరైన భద్రతా ఏర్పాట్లు లేనందునే చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మ్యూజియం పరిసరాల్లోని సీసీ కెమెరాలతో పాటు ప్రధాన కూడళ్లు, రహదారులపై ఉన్న సీసీ కెమెరాల పుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎటు వైపు వెళ్లారనే కోణంపై ఆరా తీస్తున్నారు. మ్యూజియంలో విలువైన వస్తువులు ఉన్నా కేవలం టిఫిన్‌ బాక్స్, టీ కప్పు, సాసర్‌లు మాత్రమే చోరీకి గురవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల విలువైన వస్తువులు ఉన్నప్పటికీ... కేవలం వాటిని మాత్రమే తీసుకెళ్లడంపై  దర్యాప్తు చేపట్టారు.   

15 ప్రత్యేక బృందాల ఏర్పాటు
చోరీ ఘటనపై 15 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మ్యూజియం చుట్టు పక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్, అదనపు కమిషనర్‌ (క్రైమ్స్‌) షికా గోయల్‌ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల చిత్రాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.–ఆనంద్, మీర్‌చౌక్‌ ఏసీపీ

మరిన్ని వార్తలు