సీసీ కెమెరాలు అమర్చేందుకు వచ్చి..

4 Jan, 2019 07:50 IST|Sakshi
సోదరుడిని బతికించేందుకు తాపత్రయపడుతున్న తమ్ముడు ప్రశాంత్‌

విద్యుదాఘాతానికి గురై

ఒడిశా యువకుడు దుర్మరణం

శ్రీకాకుళం, టెక్కలి రూరల్‌: టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి మెళియాపుట్టి రహదారి సమీపంలో బొంగపోలమ్మ మోడరన్‌ రైస్‌ మిల్లులో గురువారం విద్యుదాఘాతానికి గురై గుమ్మడి అశోక్‌(36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, మృతుడి తమ్ముడు ప్రశాంత్‌ తెలిపిన వివరాలు ప్రకారం... ఈ రైస్‌ మిల్లులో కొద్దిరోజుల క్రితం ధాన్యం బస్తాలు దొంగతనం జరిగింది. మరోసారి దొంగతనం జరగకుండా ఉండేందుకై మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా రాష్ట్రం కాశీనగర్‌ సమీపంలోని బొత్తవ గ్రామానికి చెందిన గుమ్మడి అశోక్, అతని సోదరుడు ప్రశాంత్‌లు మిల్లు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికై వచ్చారు.

దీనిలో భాగంగా గురువారం మిల్లు పైకి ఎక్కి సీసీ కెమెరా వైర్లు బిగిస్తుండగా పక్కనుంచి వెళుతున్న 33 కేవీ విద్యుత్‌ తీగ అశోక్‌కు తగలటంతో ఒక్కసారిగా తుల్లిపోయాడు. సమీపంలోని గోడపై పడటంతో తలకు తీవ్రగాయం కాగా తన శరీరం కాలిపోయింది. అశోక్‌ను బతికించేందుకు తమ్ముడు ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అప్పటికే తన సోదరుడు మృతిచెందాడు. వెంటనే స్పందించిన మిల్లు సిబ్బంది మిల్లుపైకి వెళ్లి మృతదేహాన్ని కిందకు తీసుకువచ్చారు. మృతుడికి షాక్‌ తగలగానే సమీపంలోని గోడపై పడడంతో తలకు తీవ్ర గాయమై, అధిక రక్తశ్రావం జరిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య గౌరి, రెండేళ్ల కుమారుడు సాత్విక్‌ ఉన్నారు. అశోక్‌ మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు