అమ్మవారి సన్నిధిలో ఇంత అపచారమా!

26 Jun, 2018 02:11 IST|Sakshi
మీడియా వచ్చే సరికి మహిళల డార్మిటరీలోని కెమెరా దృశ్యాలను ఆఫ్‌లైన్‌లో ఉంచిన సిబ్బంది. పక్కన డార్మిటరీలోని గోడకు అమర్చిన సీసీ కెమెరా

మహిళలు దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా

డార్మిటరీ దృశ్యాలను బయటి టీవీలో గుర్తించిన పెళ్లి బృందం

మూడు నెలల క్రితమే కెమెరా అమర్చిన సిబ్బంది

అధికారులపై భక్తుల ఆగ్రహం 

భగ్గుమంటున్న మహిళాలోకం

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

ఇంద్రకీలాద్రి/చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళలకు తీరని అవమానం జరిగింది. ఓ డార్మిటరీలో దుస్తులు మార్చుకునే చోట సీసీ కెమెరా ఏర్పాటు చేసి రికార్డ్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మూడు నెలలుగా జరుగుతున్న ఈ తంతు సోమవారం వెలుగులోకి వచ్చింది. గతంలో దీనిపై సిబ్బందే ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారుల నిర్వాకం చూసి భక్తులంతా అవాక్కవుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డ్‌ చేయడం దారుణమంటున్నారు. దీనిపై మహిళాలోకం భగ్గుమంటోంది. అమ్మవారి సన్నిధిలోనే తమకు రక్షణలేక పోవడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

డార్మిటరీలో సీసీ కెమెరా..
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో పాడి వీధిలో సీవీ రెడ్డి చారిటీస్‌ పేరిట కాటేజీ నిర్వహిస్తోంది. ఈ కాటేజీ మెయిన్‌ హాల్‌లో లక్ష్మి పేరిట మహిళలకు ప్రత్యేకమైన ఏసీ డార్మిటరీని ఏర్పాటు చేశారు. ఆ డార్మిటరీలో 8 మంచాలు ఉండగా, కొంత ఖాళీ స్థలం కూడా ఉంది. కాటేజీలో వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకొనే సమయంలో మహిళలకు ఏసీ డార్మిటరీని అద్దెకు ఇస్తారు. అక్కడే వారు స్నానాలు చేసి దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఆ డార్మిటరీ మొత్తం కనిపించేలా మూడు నెలల కిందట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం కాటేజీలో ఓ వివాహం జరగగా, డార్మిటరీలో పెళ్లి కుమార్తెతో పాటు మరి కొంతమంది ఆమె బంధువులు విశ్రాంతి తీసుకున్నారు. పెళ్లి కుమార్తెతో పాటు మిగిలిన మహిళలందరూ అక్కడే దుస్తులు మార్చుకున్నారు. పెళ్లి తంతు అంతా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో మగవారు లగేజీని తీసుకువెళ్లేందుకు డార్మిటరీలోకి వచ్చారు. ఆ సమయంలో అక్కడ గోడకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను గుర్తించారు. సీసీ కెమెరా పని చేస్తున్నట్లుగా చిన్న లైటు వెలుగుతుండటంతో అనుమానం వచ్చి కాటేజీ కామన్‌ హాల్‌లో ఉన్న ఆలయ సిబ్బంది కార్యాలయంలోకి సదరు వ్యక్తులు వెళ్లి చూడగా అక్కడ సీసీ కెమెరా ఫుటేజీ స్పష్టంగా కనిపించింది. దీంతో పెళ్లి వారి బంధువులు ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డింగ్‌పై నిలదీశారు. 

బుకాయిస్తున్న అధికారులు.. 
సీసీ కెమెరాల రికార్డు అంశం విషయం రచ్చకెక్కడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాలు ఆలయ అధికారులు ప్రారంభించారు. ఈలోగా విషయం తెలిసి మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించగా కార్యాలయంలోని టీవీలో రెండు కెమెరాలు పని చేస్తున్నట్లు విజవల్స్‌ కనిపించాయి. దీంతో ఆలయ అధికారుల తీరుపై ఇతర భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఈఈ భాస్కర్‌ ఘటనా స్థలానికి వచ్చి మహిళల డార్మిటరీలో సీసీ కెమెరాలు పని చేస్తున్నప్పటికీ ఫుటేజీ రికార్డు కావడం లేదని సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం పెల్లుబుకుతున్న సమయంలో కెమెరాలను ఆఫ్‌లైన్‌లోకి మార్చి వెళ్లిపోయారు. 

మూడు నెలలుగా ఇదే తీరు...
మహిళలు ఉండే కాటేజీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సరికాదని పలు మార్లు ఇంజనీరింగ్‌ సిబ్బందిని హెచ్చరించినట్లు సీవీరెడ్డి చారిటీస్‌ నిర్వహణ చూస్తున్న ఆలయ ఉద్యోగి మేరీ స్వరూప తెలిపారు. కెమెరాలపై ఫిర్యాదులను ఆలయ ఇంజనీరింగ్‌ అధికారులు పట్టించుకోలేదని, మూడు నెలలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని కాటేజీలో పని చేసే సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విజవల్స్‌ బయటకు వస్తే తమ పరిస్థితి ఏంటని మహిళా భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

భక్తుల మనోభావాలతో ఆటలా..
డార్మిటరీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆలయ అధికారులు భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. డార్మిటరీలో అనుమానితులు ప్రవేశకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు. లోపలకు ప్రవేశించే మార్గంలో ఏర్పాటు చేస్తే సరిపోతుంది కదా! లోపల ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏంటి?.

ఇలాంటి ఘటనలు దురదృష్టం
దుర్గగుడి పాలనాధికారిగా మహిళ ఉన్న సమయంలో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. జరిగిన దానిని సమర్థించుకునే కన్నా బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇంత మంది అధికారులు, పాలక మండలి సభ్యులు ఉన్నా ఆలయంలో ఏం జరుగుతోందో భక్తులు చెబితే గాని తెలుసుకోకపోవడం సరికాదు.

మహిళలకు రక్షణ లేదు
ఆలయాల్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇంత వరకు షాపింగ్‌మాల్స్,  హోటల్స్‌లోనే ఇటువంటి ఘటనలు జరిగినట్లు విన్నాం. ఇప్పుడు ఆలయాల్లోనూ... కాటేజీల్లోనూ ఇదే తంతు అంటే ఆడవారికి రక్షణ ఎక్కడ ఉంది? అధికారులు తీరు సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

విశ్రాంతి కోసమే డార్మిటరీలు: ఎం.పద్మ, దుర్గగుడి ఈవో
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు విశ్రాంతి కోసమే డార్మిటరీలు ఏర్పాటు చేశాం. డార్మిటరీలో బెడ్డు అద్దె ప్రాతిపదికన ఇస్తున్నాం. కేవలం విశ్రాంతి కోసమే వాటిని  వినియోగిస్తున్నాం తప్ప.. దుస్తులు మార్చుకునే స్థలంలా కాదు. మహిళల భద్రత కోసమే డార్మిటరీ అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

మరిన్ని వార్తలు