ఆ కెమెరాలు పనిచేస్తున్నాయా?

5 Nov, 2019 09:13 IST|Sakshi
గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని నివాసం వద్ద బంధువులు, ఇన్‌సెట్‌లో మృతురాలు విజయారెడ్డి (ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తహసీల్దార్‌ విజయారెడ్డి చాంబర్‌లో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పనిచేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తేగాని ఘటన తీరు స్పష్టంగా తెలియదు. జెడ్పీ రోడ్డుకు ఆనుకుని ఉన్న తహసీల్దార్‌ కార్యాలయంలోకి ప్రవేశించే చోట, ఆమె చాంబర్‌లోకి వెళ్లే వద్ద కూడా ఒకటి చొప్పున సీసీ కెమెరాలు బిగించారు. తహసీల్దార్‌ చాంబర్‌లోకి వెళ్లడం.. తిరిగి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉంది. నిందితుడు సురేష్‌ లోపలికి వెళ్లడం కచ్చితంగా ఈ కెమెరాలకు చిక్కే ఉంటుంది. చాంబర్‌లో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందా? ఎంతసేపు చాంబర్‌లో ఉన్నాడు? తదితర వివరాలను ఫుటేజీ పరిశీలన ద్వారా తెలిసే వీలుంది. ఒకవేళ కెమెరాలు పనిచేసి ఉంటే.. నిందితుడు కార్యాలయంలోకి ప్రవేశించడం మొదలు.. ఆమె చనిపోయే వరకు ప్రతిక్షణం రికార్డు అయి ఉంటుంది. 

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గుమిగూడిన ప్రజలు
ఒక ఘటన..నాలుగు కుటుంబాల్లో విషాదం..  
అబ్దుల్లాపూర్‌ మెట్‌లో తహసీల్దార్‌ను పట్టపగటు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేయడం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. తహసీల్దార్‌ విజయారెడ్డికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను కాపాడేందుకు యత్నించిన డ్రైవర్‌ గురునాథం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అక్కడే ఉన్న అటెండర్‌ చంద్రయ్యకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరి కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక హత్యకు పాల్పడ్డ నిందితుడు కూర సురేశ్‌కు కూడా గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగానే ఉంది. సురేశ్‌ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తానికి ఒక వ్యక్తి పెంచుకున్న కక్ష.. నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. విజయారెడ్డి పిల్లలు తల్లిలేని వారయ్యారు. తమ తండ్రి బతుకుతాడో లేదోనన్న బెంగతో సురేష్‌ పిల్లలు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో సురేశ్, డీఆర్‌డీఎల్‌ అపొలోలో డ్రైవర్‌ గురునాథ్, అటెండర్‌ చంద్రయ్య చికిత్స పొందుతున్నారు. ఇక తహసీల్దార్‌ విజయారెడ్డి మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది.

మరిన్ని వార్తలు