డొనేషన్‌.. కమీషన్‌

21 Jun, 2019 08:35 IST|Sakshi
నిందితుడు రవి

ఆదాయపుపన్ను శాఖకు రూ.22.43 కోట్ల టోకరా

‘సెక్షన్‌ 35’ మినహాయింపు ఉన్నట్టు పత్రాల సృష్టి

మూడు రాష్ట్రాల వ్యాపారులతో కలిసి భారీ దందా

సూత్రధారిని అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: కాగితాలకే పరిమితమైన సొసైటీ..రికార్డుల్లోనే పొందుపరుస్తున్న సామాజిక సేవలు..ఆదాయపు పన్ను సర్టిఫికెట్‌ సృష్టించి.. మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులతో దందా... వెరసి మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.41.74 కోట్లు డొనేషన్‌గా తీసుకున్నాడు... ఈ మొత్తాన్ని షెల్‌ కంపెనీల ద్వారా మళ్ళీ ‘దాతలకే’ పంపి కమీషన్లు తీసుకున్నాడు... మొత్తమ్మీద ఆదాయపుపన్ను శాఖకు పన్ను రూపంలో రావాల్సిన రూ.22.43 కోట్లకు గండికొట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గురువారం ప్రధాన సూత్రధారి సనతన రవిని అరెస్టు చేసిన అధికారులు ఈ కేసులో దాదాపు మరో 200 మంది నిందితులుగా ఉన్నట్లు తేల్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన సుబ్బారావు 1993లో రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీని స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు చేసే ఇలాంటి సంస్థలకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) అనేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. వీటి పనితీరును బట్టి కొన్ని మినహాయింపులు ఇస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఇవి కలిగి ఉన్న సంస్థలకు డొనేషన్లు ఇచ్చే వారికి ఆదాయపుపన్ను మినహాయింపు వస్తుంది. మహబూబ్‌నగర్‌ సమీపంలోని కొల్లాపూర్‌కు చెందిన రవి కొన్నాళ్ళు ఈ సంస్థలో పని చేశాడు. ఆపై అది తన సంస్థే అంటూ 2013లో హైదరాబాద్‌కు వచ్చి పంజగుట్ట ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేశాడు.

నల్లగొండలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ సమస్యను అధిగమించడమే తమ సంస్థ లక్ష్యమని, దీని కోసం భారీ పరిశోధనలు చేస్తున్నట్లు రికార్డులు రూపొందించాడు. దీని ఆధారంగా సీబీడీటీకి దరఖాస్తు చేసుకుని సెక్షన్‌ 12 (ఎ) సర్టిఫికెట్‌ పొందాడు. ఇది కలిగిన స్వచ్ఛంద సంస్థకు డొనేషన్‌ ఇచ్చే దాతలు ఆ మొత్తంలో 50 శాతానికి సమానమైన నగదుకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇలా కొన్నాళ్ళు డొనేషన్లు తీసుకున్న అతగాడు 2017–18 ఆర్థిక సంవత్సరంలో ‘సెక్షన్‌ 35’ కింద సర్టిఫికెట్‌ కోసం సీబీడీటీకి రవి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సర్టిఫికెట్‌ లభించిన సంస్థలకు డొనేషన్లు ఇస్తే... దాతలు ఆ మొత్తానికి 175 శాతానికి సమానమైన నగదుపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ దరఖాస్తు సీబీడీటీ వద్ద పెండింగ్‌ ఉండగానే రవి తనకు అనుమతి లభించినట్లు నకిలీ సర్టిఫికెట్‌ రూపొందించాడు. దీని ఆధారంగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ల్లోని కొందరు వ్యాపారులతో కలిసి భారీ కుట్ర పన్నాడు. వారి నుంచి ఏటా డొనేషన్లు తీసుకుంటున్న రవి వాటిని కొన్ని షెల్‌ కంపెనీలకు మళ్ళిస్తున్నాడు. వాటి సహకారంతో ఆ మొత్తంలో 95 శాతం ‘దాత’లకే పంపించేస్తూ... 5 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నాడు.

ఇలా చేయడంతో ఆయా సంస్థలకు చెందిన ‘ఆన్‌లైన్‌ ధనం’ లిక్విడ్‌ క్యాష్‌గా మారి చేతికి వస్తోంది. అంతే కాకండా ఆ మొత్తంలో 175 శాతానికి సమానమైన నగదుకు ఆయా వ్యాపారులు ఐటీ మినహాయింపు పొందుతున్నారు. ఈ రకంగా 2015–16 నుంచి 2018–19 వరకు  ఆ మూడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల నుంచి మొత్తం రూ.41,74,38,000 డొనేషన్లు తీసుకున్న రవి వాటిలో 95 శాతం షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి వారికే పంపాడు. ఇలా మొత్తమ్మీద ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన రూ.22.43 కోట్లకు గండి కొట్టడానికి సహకరించాడు. పరిశోధన చేస్తున్నట్లు ప్రకటించిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవహారాలపై ఆరా తీసిన ఐటీ అధికారులు వారికి అసలు ల్యాబొరేటరీ లేదని తేల్చారు. మరికొంత లోతుగా దర్యాప్తు చేయగా సెక్షన్‌ 35 సర్టిఫికెట్‌ నకిలీది సృష్టించారని, దీని ఆధారంగా మూడు రాష్ట్రాలకు చెందిన 200 మంది వ్యాపారులతో కలిసి భారీ స్కామ్‌కు పాల్పడి ఆదాయపు పన్నుకు గండి కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఆ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ ఎస్‌వీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో గురువారం రవిని అరెస్టు చేసింది. ‘ఈ వ్యవహారంలో దాదాపు 200 మంది వ్యాపారులకు ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నాం. దీనిపై ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని ఏసీపీ హరికృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు