‘హీరా’ గుట్టు వీడనుంది!

5 Nov, 2018 09:32 IST|Sakshi
హీరా గ్రూప్‌ కేంద్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

ఫలితాలిచ్చిన ప్రధాన కార్యాలయంలో సోదాలు

పలు కీలక హార్డ్‌డిస్క్‌లతో పాటు సర్వర్‌ స్వాధీనం

బిజూ థామస్‌ కస్టడీ పూర్తి, మళ్లీ కోరాలని నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: ఒక కంపెనీ లేదు... మ్యాన్‌ఫాక్చరింగ్‌ యూనిట్‌ లేదు. కనీసం క్రయవిక్రయాల దుకాణాలు సైతం లేవు. అయినా గడిచిన ఆరేళ్లల్లో అక్షరాల రూ.5 వేల కోట్ల టర్నోవర్‌ చేసిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గుట్టు వీడనుంది. శని, ఆదివారాల్లో ఈ సంస్థ ప్రధానం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సీసీఎస్‌ పోలీసులు సర్వర్‌తో పాటు హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించడం ద్వారా కీలక సమాచారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. మరోపక్క ఈ గ్రూప్‌నకు సాంకేతిక పరిజ్ఞానం అందించిన కేరళ వాసి బిజూ థామస్‌ను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు.  హీరా గ్రూప్‌ మొత్తం 15 కంపెనీలను కలిగి ఉంది. హీరా గోల్డ్, హీరా టెక్స్‌టైల్స్, హీరా రిటైల్స్‌... ఇలా సంస్థలు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌లో (ఆర్వోసీ) నమోదైనా వాస్తవంలో మాత్రం లేవు. కేవలం ప్రజలకు ఎర వేసి, అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరించడం మినహా మరో దందా కనిపించట్లేదు.

ఈ గ్రూప్‌ సంస్థలు విదేశాల్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇక్కడకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు. అయినా ఈ సంస్థ గడిచిన ఆరేళ్లు రూ.5 వేల కోట్లు టర్నోవర్‌ చేసినట్లు రిటరŠన్స్‌ దాఖలు చేసింది. ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ), రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటరŠన్స్‌ ఫైల్‌ చేసింది. వీటి మధ్య ఎక్కడా పొంతన లేదని సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. మరోపక్క ఏ సంస్థ అయినా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాటిని కేవలం టర్నోవర్‌గా పేర్కొంటాయి తప్ప ఆదాయంగా చూపించవు. అయితే హీరా గ్రూప్‌ మాత్రం వీటినీ తమ ఆదాయంగా చూపించినప్పటికీ డిపాజిటర్ల జాబితా మాత్రం బయటపెట్టట్లేదు. దీంతో సీసీఎస్‌ పోలీసులు శని, ఆదివారాల్లో బంజారాహిల్స్‌లోని హీరా గ్రూప్‌ కేంద్ర కార్యాలయంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఇందులోనే హీరా గ్రూప్‌ సంస్థలకు చెందిన ప్రధాన సర్వర్లు ఉన్నాయి. వీటిలో డిపాజిటర్ల వివరాలు నిక్షిప్తమై ఉంటాయని భావించిన అధికారులు వాటితో పాటు పలు కంప్యూటర్ల నుంచి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.

వీటిని సాంకేతికంగా విశ్లేషించడంతో ఈ గ్రూప్‌లో డిపాజిట్లు చేసిన డిపాజిట్‌దారులతో పాటు ఇతర కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటి ద్వారా డిపాజిట్లు ఎంత? తిరిగి చెల్లింపులు ఎంత? ఎక్కడి నుంచి నిధుల ప్రవాహం జరిగింది? అనే వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క సీసీఎస్‌ పోలీసుల ఇటీవల అరెస్టు చేసిన బిజు థామస్‌ సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు కేరళలోని హీరా గ్రూప్‌ సంస్థ నిర్వాహణ చేపట్టాడు. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే పూర్తి సమాచారం వస్తుందని పోలీసులు భావించారు. తొలుత తన సంస్థ హీరా గ్రూప్‌నకు సాంకేతిక పరిజ్ఞానం అందించినా వారి నుంచి ఓ ఉద్యోగి వచ్చి కేరళలోని తన కార్యాలయం కేంద్రంగా పని చేసే వాడని చెప్పాడు. కొన్నాళ్ల క్రితం ఇలానే వచ్చిన ఓ ఉద్యోగి ఆ సంస్థ డేటాను తన సర్వర్‌ నుంచి డిలీట్‌ చేశాడని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే సీసీఎస్‌ పోలీసులు లోతుగా ప్రశ్నించడంతో అతడి నుంచి కొంత మేర సమాచారం రాబట్టారు. ఇతడి కస్టడీ గడువు పూర్తి కావడంతో తిరిగి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిన పోలీసుల మరోసారి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. 

మరిన్ని వార్తలు