టార్గెట్‌ సెల్‌ఫోన్స్‌!

18 Apr, 2019 07:52 IST|Sakshi
ఇటీవల అరెస్టైన సెల్‌ఫోన్‌ దొంగలు(ఫైల్‌)

స్నాచర్లు, జేబుదొంగల కళ్లు వాటి పైనే

ఏటా వేల సంఖ్యలో ఫోన్లు ‘గల్లంతు’

‘జాయ్‌ స్నాచర్ల’తో కొత్త సమస్యలు

తలలు పట్టుకుంటున్న నగర పోలీసులు

ఒకప్పుడు స్నాచింగ్‌ అంటే మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్‌ తస్కరించడం మాత్రమే చేసేవారు. ఇక జేబు దొంగలైతే టార్గెట్‌ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో కంటికి తెలియకుండా దొంగిలించేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్‌పాకెటర్లు సెల్‌ఫోన్లనే టార్గెట్‌ చేస్తున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటు పడిన వారు ‘జాయ్‌ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న ఈ తరహా కేసులు ప్రస్తుతం సిటీ పోలీసులకు ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారాయి.

సాక్షి, సిటీబ్యూరో: స్నాచింగ్‌.... ఎంపిక చేసుకున్న బాధితుడు/బాధితురాలి మెడలోని గొలుసులు, చేతిలోని బ్యాగ్స్‌ తస్కరించడం పిక్‌పాకెటింగ్‌... టార్గెట్‌ చేసిన వ్యక్తి జేబులో ఉన్న పర్సును చాకచక్యంగా మరో వ్యక్తికి తెలియకుండా దొంగిలించడం ఇప్పటి వరకు ఈ తరహా నేరాలపైనే ఆధారపడేవారు. అయితే ఇటీవలి కాలంలో స్నాచర్లు, పిక్‌పాకెటర్లు సెల్‌ఫోన్లనే టార్గెట్‌ చేసుకుంటున్నారు. చదువుకున్న యువత, జల్సాలకు అలవాటుపడిన వారు సైతం ‘జాయ్‌ స్నాచర్లు’గా మారి పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో ప్రస్తుతం సిటీ పోలీసులకు ‘సెల్‌ఫోన్‌’ ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారింది. గణాంకాల ప్రకారం నగరంలో ఏటా దాదాపు 50 వేలకు పైగా సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.దీనికితోడు అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్‌ పిక్‌పాకెటింగ్,  స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నారు. 

పర్సులు, గొలుసుల నుంచి సెల్‌ఫోన్ల వైపు...
నగరంలోని పిక్‌పాకెటింగ్‌ గ్యాంగ్‌లు గతంలో కేవలం పర్సులను మాత్రమే టార్గెట్‌ చేసేవి. అయితే ప్లాస్టిక్‌ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్‌ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు. ఐదేళ్ల క్రితం వరకు చైన్‌ స్నాచింగ్‌ ముఠాలు వరుపెట్టి పంజా విసిరాయి. అయితే  ప్రజల్లో పెరిగిన చైతన్యం, పోలీసుల చర్యలతో ఈ వ్యవస్థీకృత ముఠాలకు చెక్‌ పడింది. మిగిలిన స్నాచర్లకు మెడల్లో బంగారం దొరకడం గగనంగా మారిపోవడంతో వారి దృష్టీ సెల్‌ఫోన్లపై పడింది. అందుకే ఇటీవల కాలంలో పిక్‌పాకెటర్లు పర్సులను, స్నాచర్లు గొలుసుల్ని వదిలేసి సెల్‌ఫోన్లపై పడ్డారు. కొందరు ముఠాలు కట్టి వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. 

నిషా జోరు..సరదా కోసం..
ఇటీవల కాలంలో ‘జాయ్‌ సెల్‌ఫోన్‌ స్నాచర్లు’ పెరిగిపోతుండటం నగర పోలీసులకు కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ నేరాలు చేసే వారిలో అత్యధికులకు వాస్తవానికి ఆ అవసరం ఉండదు. ఇలాంటి స్నాచర్ల కుటుంబాలు సైతం స్థిరపడినవో, విద్యాధికులతో కూడినవో ఉంటున్నాయి. అయితే మద్యం మత్తులోనో, గంజాయికి బానిసలుగా మారడంతోనో వీరు గతి తప్పుతున్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ‘తాత్కాలిక స్నాచర్లుగా’ మారిపోయి అప్పుడప్పుడు నేరాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలోనూ కొందరు ఈజీ మనీకి అలవాటుపడి వరుసపెట్టి నేరాలు కొనసాగిస్తున్నారు. వ్యవస్థీకృతం కాని, నేరం చేయాల్సి అవసరం లేని వారిలో సరదా కోసం చేస్తున్న వారి సంఖ్యా ఇటీవల పెరుగుతోందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు సరదా కోసం సెల్‌ఫోన్లు లాక్కుపోతూ స్నాచింగ్, దోపిడీ కేసుల్లో నిందితులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా దక్షిణ మండలంతో పాటు అంతరాష్ట్ర, జిల్లా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఉన్న చోట్ల ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్ని సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి తెస్తున్న పోలీసులునేరగాళ్లను కట్టడి చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. 

ఐఎంఈఐ నంబర్‌ మార్చేసి...  
ప్రతి మొబైల్‌ ఫోన్‌కు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్యుప్‌మెంట్‌ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే (ఐఎంఈఐ) నంబర్‌ ఉంటుంది. మనిషి వేలిముద్రల మాదిరిగా ప్రపంచంలోని ఏ రెండు సెల్‌ఫోన్లకూ ఒకే నెంబర్‌ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్‌ ట్యాంపర్‌ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్‌ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నంబర్‌ కేటాయిస్తారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్‌ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్‌ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్‌ ద్వారా సేకరించి చోరీ చేసిన వాటికి వేసే వారు. తద్వారా సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. గతంలో కేవలం ఈ విధానం ద్వారా మాత్రమే దొంగ ఫోన్లను ‘దొర’ఫొన్లుగా మార్చేసేవారు. 

సరిహద్దులు దాటిస్తూ...
తాజాగా చోరీ సెల్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్న ఇటీవల కాలంలో ఈ చోరీ సెల్‌ఫోన్లను కొనుగోలు చేసే మారు వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే తస్కరణకు గురవుతున్న సెల్‌ఫోన్లలో గరిష్టంగా 30 నుంచి 40 శాతం కూడా రికవరీ కావట్లేదని భావిస్తున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ తరహా వ్యాపారాలు ప్రారంభించిన చోరీ మాల్‌ వ్యాపారస్థులు సిండికేట్స్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు కొన్ని ఆధారాలు సేకరించారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. ఇలా వచ్చిన మాల్‌లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్‌ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్‌ఫోన్లను చైనాకు పంపుతున్నట్లు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్‌ చోరుల నుంచి కొన్న ఖరీదైన హై–ఎండ్‌ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు నిర్థారిస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవల కాలంలో చోరీకి గురైన హై–ఎండ్‌ సెల్‌ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు తెలిపారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు