కిక్కులో స్నాచింగ్స్‌

25 Mar, 2019 11:56 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన నిందితులు

మద్యం మత్తులో సెల్‌ఫోన్ల దొంగతనం

మిత్రుడు ఇచ్చిన సలహాతో రంగంలోకి ముగ్గురు

ఒకే రోజు గంట వ్యవధిలో నాలుగు చోట్ల స్వైరవిహారం

చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

గతంలో చిక్కిన ముఠాతో ఒకరికి సంబంధం

సాక్షి, సిటీబ్యూరో: బతుకుతెరువు కోసం నగరానికి వసల వచ్చిన వారి కుటుంబాలు కష్టపడి పని చేసుకుంటున్నాయి. వీరి ముగ్గురు సంతానం కూడా సోఫా రిపేరింగ్‌ చేస్తూ బతుకుతున్నారు. వీరిలో ఒకరు గత ఏడాది ఓ స్నేహితుడితో కలిసి నేరం చేశాడు. వారం రోజుల క్రితం ముగ్గురూ కలిసి మద్యం తాగినప్పుడు  కిక్కులో ఒకతను ఆ విషయం చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన ముగ్గురు కేవలం గంట వ్యవధిలో రెండు ఠాణాల పరిధిలో నాలుగు సెల్‌ఫోన్లు స్నాచింగ్స్‌ చేశారు. ఈ ముఠా కదలికల్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. 

విజయవాడ నుంచి వలసవచ్చి..
ఆంధ్రప్రదేశ్‌ విజయవాడకు చెందిన మూడు కుటుంబాలు దాదాపు 15 క్రితం నగరానికి వలసవచ్చాయి. తుకారాంగేట్‌ పరి«ధిలోని అంబేడ్కర్‌ నగర్‌లో స్థిరపడిన ఈ కుటుంబాల్లో ఇద్దరు అన్నదమ్ములు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వీరికి జక్కుల వంశీ, జక్కుల జాన్, పూజారీ ఏసోబ్‌ అనే కుమారులు ఉన్నారు.   వీరు కూడా నగరంలోని పలు కాలనీల్లో సంచరిస్తూ సోఫాలు రిపేర్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏసోబుకు తుకారాంగేట్‌ టీచర్స్‌ కాలనీకి చెందిన టమాటో సంజయ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో గతేడాది మైనర్‌గా ఉండగానే అతడితో కలిసి సికింద్రాబాద్‌ గవర్నమెంట్‌ రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేసి పోలీసులకు చిక్కి జువైనల్‌ హోమ్‌కు వెళ్లాడు. గురువారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పట్టుకున్న నలుగురు సెల్‌ఫోన్‌ స్నాచర్స్‌ గ్యాంగ్‌లో సంజయ్‌ కూడా ఉండటం గమనార్హం. 

మద్యం మత్తులో నిర్ణయం...
సమీప బంధువులు, స్నేహితులు అయిన వంశీ, జాన్, ఏసోబు గత కొంతకాలంగా కల్లు, మద్యానికి అలవాటు పడ్డారు. దీంతో సోమవారం ఈ ముగ్గురూ కలిసి తుకారాంగేట్‌ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తు తలకెక్కిన తర్వాత సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్‌ చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అది మన ఖర్చులకు సరిపోతుందని ఏసోబు సలహా ఇచ్చాడు. దీనికి మిగిలిన ఇద్దరూ అంగీకరించడంతో అర్దరాత్రి ముగ్గురూ కలిసి బయటకు వచ్చారు. జాన్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై తుకారాంగేట్‌ నుంచి బయలుదేరిన ఈ త్రయం ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ మహంకాళి, గోపాలపురం ఠాణాల పరిధుల్లో చెక్కర్లు కొట్టారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న వారిని గుర్తించి వారి సెల్‌ఫోన్లను దొంగిలించి పారిపోవడం మొదలెట్టారు. వంశీ వాహనం నడుపుతుండగా అతడి వెనుక జాన్, తర్వాత ఏసోబు కూర్చున్నారు. ఫోన్లు స్నాచ్‌ చేసే ఏసోబు వాటిని జాన్‌కు ఇచ్చేవాడు.

గంటలో నాలుగు చోట్ల పంజా..
ఈ పంథాలో స్వైరవిహారం చేసిన ఈ గ్యాంగ్‌ కేవలం గంట వ్యవధిలో నాలుగు చోట్ల పంజా విసిరి సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్‌కు పాల్పడింది. ఈ ఉదంతాలకు సంబంధించి ఆయా ఠాణాల్లో కేసులు సైతం నమోదయ్యాయి. వీటి దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నేరాలు చోటు చేసుకున్న ప్రాంతాల్లోని సీసీ కెమెరాలపై దృష్టి పెట్టారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్‌ఐలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, కేఎస్‌. రవి, జి.రాజశేఖర్‌రెడ్డితో కూడిన బృందం మొత్తం దాదాపు 250 కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను అధ్యయనం చేసి నిందితులను గుర్తించింది. ఆదివారం ముగ్గురిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ వారి నుంచి సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మహంకాళి పోలీసులకు అప్పగిం చినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు