టార్గెట్‌ సెల్‌ఫోన్స్‌! 

4 Feb, 2019 12:30 IST|Sakshi
పోలీసుల అదుపులో ముగ్గురు దొంగలు

ఆటోడ్రైవర్, ప్యాసింజర్ల అవతారంలో నేరగాళ్లు 

 ప్రయాణికులను ఎక్కించుకుని వారి దృష్టి మళ్లింపు 

అదను చూసి సెల్‌ఫోన్ల చోరీ ముగ్గురి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: అతనో రౌడీషీటర్‌ నగర పోలీసులు రెండుసార్లు అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు... అయినా పంథా మార్చుకోని అతను మరో ముగ్గురితో కలిసి దృష్టి మళ్లించి సెల్‌ఫోన్లు తస్కరించడం మొదలెట్టాడు. ఇటీవల కాలంలో మొత్తం ఐదు చోరీలు చేసిన ఈ ముఠాలో ముగ్గురిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పటుకున్నారు. వీరి నుంచి 11 సెల్‌ఫోన్లు, ఆటో స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు డీసీపీ  రాధాకిషన్‌రావు తెలిపారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్‌ పర్వేజ్‌ అలియాస్‌ ఫర్రు వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. దురలవాట్లకు బానిసైన అతను నేరాలు చేయడం మొదలెట్టాడు. హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నమోదైన వాటితో సహా మొత్తం 24 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉండటంతో రెయిన్‌బజార్‌ పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు.

ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు విభాగం 2015, 2017ల్లో పీడీ యాక్ట్‌ ప్రయోగించింది. ఈ రెందు సందర్భాల్లోనూ ఏడాది చొప్పున జైల్లో ఉండి బయటకు వచ్చిన ఇతను సైనిక్‌పురికి మకాం మార్చాడు. మురాద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్, చిలకలగూడ వాసి మహ్మద్‌ నదీమ్‌లతో పాటు గౌస్‌తో ముఠా కట్టాడు. వీరిలో నేరచరితుడైన ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నాయి. పర్వేజ్‌ పరిచయస్తులైన ఆటో యజమానుల నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకునేవాడు. తాను ఆటోడ్రైవర్‌గా నటిస్తూ తన ముగ్గురు అనుచరులను ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చోబెట్టుకుంటాడు. సికింద్రాబాద్‌ బస్టాండ్, రైల్వేస్టేషన్లతో పాటు మెహదీపట్నం బస్టాండ్‌లలో మాటు వేసూ ఈ ముఠా ఒంటరి ప్రయాణికుల్ని ఎంపిక చేసుకుని వారు వెళ్లాల్సిన గమ్యాలను చేరుస్తామని ఎర వేసి ఎక్కించుకుంటుంది.

ఆటో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత ప్రయాణికుడి దృష్టి మళ్లించే నిందితులు అతడి సెల్‌ఫోన్‌ కాజేస్తారు. ఆపై తమకు వేరే పని ఉందంటూ మార్గమధ్యంలో ఆ ప్రయాణికుడిని దింపేసి.. అతడు సెల్‌ఫోన్‌ పోయిన విషయం గుర్తించేలోపే వేగంగా ఉడాయిస్తారు. ఈ గ్యాంగ్‌ ఇటీవల కాలంలో ఇదే తరహాలో మహంకాళి, గోపాలపురం. ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, రాయదుర్గం ఠాణాల పరిధిలో 11 సెల్‌ఫోన్లు చోరీ చేశారు. వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అంతా పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ తరహా ఫిర్యాదులు వరుసగా అందడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ ఆధారంగా అనుమానితులను గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.పరమేశ్వర్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ తమ బృందాలతో వలపన్నారు. సికింద్రాబాద్‌లోని 31 బస్టాప్‌ వద్ద గౌస్‌ సహా మిగిలిన ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును మహంకాళి పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు