ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ వివాదం

27 Feb, 2019 02:38 IST|Sakshi

బీటెక్‌ విద్యార్థి హత్య 

గొంతు నులిమి చంపిన స్నేహితులు

పటాన్‌చెరు టౌన్‌: సెల్‌ఫోన్‌పై గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సెల్‌ఫోన్‌ విషయమై విద్యార్థుల మధ్య ఏర్పడ్డ వివాదం బీటెక్‌ విద్యార్థి ప్రాణాలు తీసింది.  ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరికి చెందిన పితాని నాగేశ్వర్‌రావు కుటుంబం 20 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండల పరిధిలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్‌ కాలనీకి వచ్చారు. ఇతని కుమారుడు గౌతమ్‌ (18) హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఆర్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్‌ తనకు సెల్‌ఫోన్‌ అవసరం ఉందని స్నేహితుడైన పవన్‌కి చెప్పాడు.

ఆన్‌లైన్‌లో ఆఫర్స్‌ ఉన్నాయని చెప్పి సెల్‌ఫోన్‌ బుక్‌ చేయాల్సిందిగా పవన్‌ తన స్నేహితుడైన వినయ్‌కు రూ.8 వేలను గౌతమ్‌ నుంచి ఇప్పించాడు. నగదు ఇచ్చి నెలరోజులైనా సెల్‌ఫోన్‌ ఇవ్వకపోవడంతో గౌతమ్‌ ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో నాగేశ్వర్‌రావు వారిని అడగడంతో వినయ్, అతని స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సెల్‌ఫోన్‌ కోసం డబ్బులు ఇచ్చాను కదా అని పవన్‌ను గౌతమ్‌ నిలదీశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అమీన్‌పూర్‌ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు రమ్మని గౌతమ్‌కు పవన్‌ చెప్పాడు. గౌతమ్‌ అక్కడికి వెళ్లగా పవన్, అతని స్నేహితుడు కాశీమ్‌ అక్కడ ఉన్నారు.

ఈ విషయమై మరోసారి వారిమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పవన్, కాశీమ్‌ ఇద్దరూ కలిసి గౌతమ్‌ గొంతు నులిమి చంపేసి స్థానిక సుల్తాన్‌పూర్‌ చెరువులో పడేశారు. అనంతరం తమ మిత్రులైన మిశ్ర, వినయ్‌కి విషయం చెప్పారు. తమ కుమారుడు కనిపించడం లేదని గౌతమ్‌ తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి గౌతమ్‌ స్నేహితులను విచారించగా అసలు నిజం బయటపడింది. గౌతమ్‌ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్, కాశీమ్‌ను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు