గర్ల్‌ఫ్రెండ్‌.. లగ్జరీ లైఫ్‌

29 Jan, 2020 07:01 IST|Sakshi
నిందితులు భానువికాస్, మానస

దొంగతనాలకు ప్లాన్‌ చేసిన యువకుడు

ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలు

పెప్పర్‌స్ప్రే చల్లి నగలతో ఉడాయింపు

ఇరువురిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి చెందిన కొత్త కాలనీల్లో నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లలోని ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్, మేడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెంగిచర్లలోని కనకదుర్గా కాలనీలో నివాసముంటున్న అసురెడ్డి బాలమణి ఇంట్లో గతేడాది డిసెంబర్‌ 19న చోరీ చేసిన పప్పుల భానువికాస్, సకినాల మానసను పట్టుకున్నారు. రాచకొండ క్రైమ్స్‌ డీసీపీ పి.యాదగిరి కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామానికి చెందిన భానువికాస్‌ ప్రస్తుతం మేడిపల్లిలోని కమలానగర్‌లో ఉంటున్నాడు. వరంగల్‌ జిల్లా ఆరెపల్లిలో పదో తరగతి చదివిన సమయంలో భానువికాస్‌కు అతని సోదరి క్లాస్‌మేట్‌ మానస పరిచయంతో స్నేహితులుగా మారారు. ప్రస్తుతం ఆమె ఉప్పల్‌ శాంతినగర్‌లో ఉంటోంది. 2012– 16 మధ్యకాలంలో యనంపేటలోని ఎస్‌ఎన్‌ఐటీ కాలేజీ నుంచి బీటెక్‌ ఈసీఈ చదివిన భానువికాస్‌ ప్రస్తుతం జోమాటాలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు లగ్జరీ లైఫ్‌ కోసం గర్ల్‌ఫ్రెండ్‌ మానసతో కలిసి చోరీలకు ప్లాన్‌ చేశాడు. 

మంచినీళ్లు కావాలంటారు..పెప్పర్‌స్ప్రే చల్లుతారు
భానువికాస్, మానసలు కలిసి బైక్‌పై వెళ్లి నిర్మానుష్య ప్రాంతం, కొత్తగా అభివృద్ధి చెందిన కాలనీలో దూరం దూరంగా ఉండే ఇళ్లలోని ఒంటరి మహిళలను గుర్తిస్తారు. మంచినీళ్లు కావాలంటూ మాటల్లో దింపుతారు. పెప్పర్‌స్ప్రే చల్లి మహిళల మెడలోని బంగారు నగలతో  ఉడాయిస్తుంటారు. ఈ క్రమంలో చెంగిచర్లలో గత ఏడాది డిసెంబర్‌ 19న చోరీ చేశారు. పోచారం ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న తన కూతురు శ్రావణిని బస్‌స్టాప్‌ వద్దకు పంపించి తిరిగి చెంగిచర్లలోని తన ఇంటికి వచ్చిన బాలమణి ఒంటరిగా ఉంది. ఇది గుర్తించిన భానువికాస్, మాసనలు మంచినీళ్లు కావాలంటూ అడిగారు. నీరు తీసుకొస్తున్న సమయంలో ఆమె ముఖంపై పెప్పర్‌ స్ప్రే కొట్టి మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకొని పరారయ్యారు. 

పట్టించిన బైక్‌..
బాధితురాలు చెప్పిన వివరాలతో పాటు ఆయా కాలనీల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా టీఎస్‌03 ఈటీ 1326 హోండా యాక్టివా మోటార్‌ సైకిల్‌ను గుర్తించారు. చోరీ జరిగిన నాటి నుంచి ఈ వాహనంపై పోలీసులు నిఘా వేస్తారని గమనించిన నిందితులు చాకచక్యంగా వ్యవహరించి దానిని వినియోగించలేదు. తమపై నిఘా తగ్గిందన్న ఉద్దేశంతో 40 రోజుల తర్వాత ఆ బైక్‌పైనే నిందితులిద్దరూ బోడుప్పల్‌ కమాన్‌ వైపు వెళుతున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. దీంతో ఆ బైక్‌తో పాటు ఆ ఇద్దరిని పట్టుకున్నారు. మూడు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు