ప్రిన్స్‌ 22 కేసులు 52

6 Apr, 2018 08:14 IST|Sakshi
ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీలో లభించిన సీసీ ఫుటేజీలో నిందితుడు

ఘరానా స్నాచర్‌ అరెస్ట్‌

నిందితుడిపై 52 కేసులు  

మలక్‌పేట: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పలు దొంగతనాలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు.  మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ గంగారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బార్కాస్‌కు చెందిన మహ్మద్‌ అమీర్‌ అలీయాస్‌ ప్రిన్స్‌ (22) చిన్నతనం నుంచే అవారాగా తిరిగేవాడు. 2009 నుంచి దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జువైనల్‌ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. 2012 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో అతనిపై 52 స్నాచింగ్‌లు, దొంగతనం కేసు నమోదయ్యాయి.

గత ఏడాది పీడీయాక్ట్‌ కింద జైలుకు వెళ్లిన అతను గత నెల 30న బయటికి వచ్చాడు. అయినా తన పంథా మార్చుకోకుండా చత్రినాక పీఎస్‌ పరిధిలో హోండాషైన్‌ బైక్‌ను ఎత్తుకెళ్లాడు. అదే బైక్‌పై తిరుగుతూ ఈ నెల 3 న మూసారంబాగ్‌ డివిజన్‌ ఫ్రెండ్స్‌కాలనీలో వాకింగ్‌కు వెళుతున్న ప్రమీలాబాయి మెడలోంచి 4 తులాల బంగారు మంగళ సూత్రం తెంచుకుని వెళ్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికురాలు జ్యోతి చీపురు కర్రతో కొట్టిన ఆమెను తప్పించుకుని ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ కాలనీ వైపు పరాయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైక్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం మలక్‌పేట పోలీసులకు అప్పగించగా, రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు