సింగిల్‌గానే స్నాచింగ్స్‌!

18 Dec, 2018 09:21 IST|Sakshi

ప్రాక్టీస్‌ కోసం ఐదుసార్లు విఫలయత్నాలు

విజయవంతమయ్యాక ఆరు గొలుసు చోరీలు

దొంగ సొత్తు అమ్మకుండా తాకట్టు

టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నర్సింహ నేపథ్యమిది..

సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్‌ కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఒంటరిగానే స్నాచింగ్స్‌ చేయాలనుకున్నాడు... బైక్‌ నెంబర్‌ను ‘మార్కింగ్‌’ చేసి ఐదుసార్లు విఫలయత్నం చేశాడు... ఆరోసారి  సక్సెస్‌ కావడంతో ‘స్ఫూర్తిని’ కొనసాగిస్తూ మరో ఆరు నేరాలు చేశాడు... చోరీ సొత్తును ఎవరికీ అమ్మకుండా కేవలం ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టులు పెట్టేవాడు. మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పట్టుకున్న బాక్సర్‌ కమ్‌ స్నాచర్‌ కోన నర్సింగ్‌రావు అలియాస్‌ నర్సింహ నేపథ్యమిదీ. ప్రాథమికంగా ఇతడిని గాంధీనగర్‌ పోలీసులు జైలుకు పంపగా... మిగిలిన ఐదు ఠాణాల అధికారులు ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌పై తమ కేసుల్లో అరెస్టులు చేయాలని నిర్ణయించారు. 

తండ్రి పదవీ విరమణతో...
నర్సింహ తండ్రి కృష్ణ నిలోఫర్‌ ఆస్పత్రిలో చిరుద్యోగిగా పని చేసేవాడు. 2006లో అతను రిటైర్‌ కావడంతో చదువు మానేసిన నర్సింహ అప్పటికే తెలిసిన బాక్సింగ్‌ విద్యతో కోచ్‌గా మారాడు. పగలు, సాయంత్రం ఈ ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి క్యాబ్‌పై పడింది. తెలిసినవారి వద్ద అప్పులు చేసిన కారు కొనుగోలు చేసిన అతను ఓ కంపెనీకి అద్దెకు పెట్టాడు. అందులో తీవ్ర నష్టాలుడంతో అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితికి చేరాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. బాక్సింగ్‌ కోచ్, క్యాబ్‌ డ్రైవర్‌గా సంపాదించింది కుటుంబ పోషణకే చాలకపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరాడు. దీంతో స్నాచింగ్స్‌ చేయడం ద్వారానే తేలిగ్గా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందని భావించాడు. 

జట్టు కడితే ‘లీకేజ్‌’ సమస్యని...
సాధారణంగా స్నాచింగ్‌ చేయాలంటే ఇద్దరు ఉండాల్సిందే. ఒకరు బైక్‌ నడుపుతుంటే మరొకరు గొలుసు లాగుతారు. అయితే ఇలా ఎవరితోనైనా కలిసి ముఠా కడితే అతడి ద్వారా తన ఉనికి బయటపడుతుందని భావించిన నర్సింహ  ఒంటరిగానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఏడు నెలల క్రితం ఓ బైక్‌ ఖరీదు చేసిన అతను దానిపై మలక్‌పేట, ఉప్పల్, బీరప్పగడ్డ, వనస్థలిపురం ప్రాంతాల్లో సంచరించాడు. ఒంటరిగా వెళ్తున్న మహిళల మెళ్లోని మంగళసూత్రాలు లాగే ప్రయత్నం చేశాడు. ఈ ఐదుసార్లూ గొలుసులు తెంపగలిగినా అవి బాధితుల చేతికి చిక్కడమో, తప్పించుకునే ప్రయత్నాల్లో కింద పడిపోవడమే జరిగింది. దీంతో మరింతగా ‘ప్రాక్టీసు’ చేసిన నర్సింహ చివరకు సింగిల్‌గానే వాహనంపై తిరుగుతూ స్నాచింగ్స్‌ చేయడంపై పట్టు సాధించాడు.

మూడును ఎనిమిదిగా మార్చుకుని...
అయితే అతను పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకూడదనే ఉద్దేశంతో స్నాచింగ్‌కు వెళ్లేప్పుడు ప్రధాన రహదారులు, సిగ్నల్స్‌ ఉన్న జంక్షన్స్‌ను వినియోగించే వాడుకాదు.  ఇతడు సంచరించే బైక్‌ నెంబర్‌ ఏపీ 28 బీపీ 4232 కాగా నేరం చేయడానికి వెళ్లే ప్రతి సందర్భంలోనూ ‘3’ను మార్కర్‌తో ‘8’గా మార్చేసేవాడు. ‘పని’ పూర్తయిన తర్వాత దానిని తడిచేసేవాడు. ఇదే తరహాలో అతను మీర్‌పేట్, అమీర్‌పేట్, ఉప్పల్, వనస్థలిపురం, గాంధీనగర్, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో ఆరు స్నాచింగ్స్‌ చేసి రూ.7 లక్షల విలువైన 16.5 తులాల బంగారం లాక్కెళ్లాడు. ఈ నేరాలు చేస్తున్నప్పుడూ ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో బాక్సింగ్‌ కోచ్‌గా కొనసాగాడు. 

తాకట్టు పెట్టి క్యాష్‌ చేసుకుంటూ...
ఈ మంగళసూత్రాలు, అవి ఉండే గొలుసులను నర్సింహ ఎక్కడా అమ్మలేదు. కేవలం పెద్ద సంస్థల్లో తాకట్టు పెట్టేవాడు. తన గుర్తింపుకార్డును దాఖలు చేస్తూ గొలుసులను తాకట్టు పెట్టి వాటి విలువలో 80 శాతం నగదు తీసుకుని ఉడాయించేవాడు. మంగళసూత్రాలు తాకట్టు పెడితే అనుమానం వస్తుందని వాటిని తన వద్దే ఉంచేవాడు. రెండుమూడు సూత్రాలు పోగైన తర్వాత వాటిని ఉప్పుగూడలోని వృద్ధుడైన గోల్డ్‌స్మిత్‌ వద్దకు తీసుకెళ్లేవాడు. అతడి సాయంతో వాటిని కరిగించి గాజుగా మార్చేవాడు. ఆపై దీనిని కుదువపెట్టి క్యాష్‌ చేసుకునే వాడు. కేవలం తాకట్టు పెట్టడం తప్ప విడిపించడం అనేది ఇతడి ‘చరిత్రలో’ లేదు. శనివారం నర్సింహను పట్టుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాంధీనగర్‌ ఠాణాకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు