కూలీ.. ఎలక్ట్రీషియన్‌.. స్నాచర్‌!

23 Mar, 2019 11:45 IST|Sakshi
సీసీ కెమెరా పుటేజీలో నిందితుడు ఇమ్రాన్‌

కుటుంబ పోషణ కోసం ఏడో తరగతితోనే చదువుకు స్వస్తి

ఒకటి తర్వాత ఒకటిగా 6 వృత్తులు చేసిన వైనం

కష్టపడటం ఇష్టంలేక నేరాల బాట

గొలుసు దొంగను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: చిన్న వయస్సులోనే కుటుంబ భారం మీద పడటంతో ఏడో తరగతితోనే చదువుకు స్వస్థి చెప్పిన అతగాడు బతకుతెరువు కోసం అనేక పనులు చేశాడు. ఇలా కష్టం పడటం ఇష్టం లేక మరో ఇద్దరితో కలిసి స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టాడు. జైలుకు వెళ్లినా బుద్ధిమారకుండా మరోసారి పంజా విసిరి సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కాడు. ఈ పంథాలో రెచ్చిపోతూ కాలినడకన వచ్చి ఉప్పర్‌బస్తీలో స్నాచింగ్‌కు పాల్పడిన మహ్మద్‌ ఇమ్రాన్‌ను కటకటాల్లోకి పంపినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ శుక్రవారం వెల్లడించారు.

ఏడుతో ఆపి ఆరు ‘అవతారాలు’...
గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ ఏడో తరగతి చదువుతుండగా కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో అక్కడితో చదువుకు స్వస్థి చెప్పిన అతను కుటుంబ పోషణ కోసం కూలీగా మారాడు. అంతటితో ఆగిపోకుండా ఒక్కోటి నేర్చుకుంటూ కార్పెంటర్, ప్లంబర్, ఆటోమొబైల్‌ మెకానిక్, ఎలక్ట్రీషియన్‌గానూ పని చేశాడు. చివరకు ఎయిర్‌ కండిషనర్ల మెకానిజం నేర్చుకున్న ఇమ్రాన్‌ ఏసీ టెక్నీషియన్‌గా స్థిరపడ్డాడు. ఇంత వరకు బాగానే ఉన్నా... అలా వచ్చే సంపాదనతో సంతృప్తి చెందకపోవడమే అసలు సమస్యకు కారణమైంది. 

ఆ ఇద్దరితో కలవడంతో...
అసలే తన సంపాదన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇమ్రాన్‌కు గోల్కొండ ప్రాంతానికే చెందిన నేరగాళ్లు అఫ్రోజ్, జఫ్ఫార్, ఇర్ఫాన్‌లతో పరిచయం ఏర్పడింది. వీరి ప్రోద్భలంతో స్నాచర్‌గా మారిన అతను 2014లో వనస్థలిపురం ఠాణా పరిధిలో రెండు స్నాచింగ్స్‌ చేశాడు. అదే ఏడాది అక్టోబర్‌లో పోలీసులకు చిక్కిన ఇతను 2017 ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆపై కొన్నాళ్లు తన ఏసీ టెక్నీషియన్‌ పని కొనసాగించాడు. చేతినిండా పని లేకపోవడంతో ఆ ఆదాయం కుటుంబపోషణకు సరిపోలేదు. దీంతో మళ్లీ పాతబాటే పట్టాలని నిర్ణయించుకున్నాడు. 

పక్కాగా రెక్కీ.. ఆపై పరిచయం...
రెయిన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని యాకత్‌పురలో అనేకచోట్ల ఇమ్రాన్‌ రెక్కీ చేశాడు. చివరకు ఉప్పర్‌బస్తీలో ఉండే ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో ఆమె ఒక్కరే ప్రతిరోజూ ఒంటరిగా ఇంటి బయట కూర్చుంటూ ఉండటం, జనసంచారం తక్కువగా ఉండటం ఇతడికి కలిసి వచ్చాయి. రెండు రోజుల పాటు అటుగా వెళ్లిన ఇమ్రాన్‌ ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకున్నాడు. తనపై ఆమెకు పూర్తి నమ్మకం వచ్చిందని తెలిసిన తర్వాత అసలు ప్లాన్‌ అమలు చేశాడు. ఆ రోడ్డుపై ద్విచక్ర వాహనం తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో కాలినడకనే వెళ్లి ఆమె మెడలో ఉన్న 12 తులాల బంగారం గొలుసు లాక్కుపోయాడు.

15 కిమీ సాగిన ‘దర్యాప్తు’...
కొంతదూరం పారిపోయిన ఇమ్రాన్‌ తనను ఎవరూ గుర్తించకుండా ఉండటానికి దుస్తులు కూడా మార్చుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రెయిన్‌బజార్‌ ఠాణాలో కేసు నమోదైంది. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు కేఎన్‌ ప్రసాద్‌వర్మ, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ తఖ్రుద్దీన్, వి.నరేందర్‌ తమ బృందాలతో రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలి నుంచి 15 కిమీ వరకు ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను అధ్యయనం చేశారు. అలా లభించిన క్లూ ఆధారంగా ఇమ్రాన్‌ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం పహాడీషరీఫ్‌లోని సోదరుడి ఇంట్లో పట్టుకున్నారు. ఇతడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు