అప్పులు తీర్చలేక చైన్‌ స్నాచర్‌ అవతారం

25 Sep, 2017 19:19 IST|Sakshi
చైన్‌ స్నాచింగ్‌.. ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరుపతి సిటీ: చీటీల పేరుతో చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి చైన్‌ స్నాచర్‌ అవతారం ఎత్తాడు. 23 చైన్‌ స్నాచింగ్‌లతో 900 గ్రాముల బంగారాన్ని కొల్లగొట్టాడు. ఇలా దొంగగా మారిన వీరనాగులు అనే యువకుడిని స్థానికుల సహకారంతో అలిపిరి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎఎస్పీ సిద్ధారెడ్డి, అలిపిరి సిఐ శ్రీనివాసులు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బంగారు గొలుసులూ మీడియా ఎదుట హాజరుపరిచారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెడన గ్రామానికి చెందిన రామలక్ష్మి కాలనీకి చెందిన భద్రరావు కుమారుడు వీరనాగులు (27). కొన్నేళ్ల కిందట వీరనాగులు తల్లిదండ్రులపై అలిగి తిరుపతికి పారిపోయి వచ్చాడు. తిరుపతిలోనే ఉంటూ ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. వీరు నగరంలోని భవానీ నగర్‌లో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరనాగులుకు స్థానికులతో పరిచయాలు కావడంతో రూ.2 లక్షల మేర చీటీ నిర్వహిస్తున్నాడు. అయితే చీటీలు ఎత్తుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో చీటీలు వేసిన వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆర్థికంగా చితికిపోవడంతో చైన్‌ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్‌ చేసుకుని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్ళేవాడు.

23 చైన్‌ స్నాచింగ్‌లు.. 900 గ్రాములు బంగారం
రెండేళ్లుగా ఎవ్వరికీ అనుమానం రాకుండా వీరనాగులు చైన్‌ స్నాచింగ్‌ను వృత్తిగా చేసుకున్నాడు. ఒకసారి చైన్‌ స్నాచింగ్‌ చేసుకుని వచ్చాడంటే తిరిగి 20 రోజులదాకా అటు వెళ్లడు. ఆలోపు కిరాణా షాపు నిర్వహించుకుంటూ ఉండేవాడు. చైన్‌ స్నాచింగ్‌లతో మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇటీవల రామచంద్రానగర్‌లో ఒక మహిళ పట్టపగలు ఒంటరిగా నడిచి వెళ్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికుల సహకారంతో అలిపిరి సీఐ శ్రీనివాసులు, క్రైం పార్టీ పోలీసు బృందం రవిరెడ్డి, గోపి, రాజు ఇతర సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్, అలిపిరి, తిరుచానూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 900 గ్రాముల విలువ చేసే సుమారు 23 బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లు విచారణలో తేలింది. వీరనాగులు నుండి చోరీలకు పాల్పడిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీఎస్పీ సిద్ధారెడ్డి తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు