సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ

22 Nov, 2019 09:04 IST|Sakshi
బాధిత మహిళ నుంచి వివరాలు సేకరిస్తున్న రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై వీరన్న

గౌరారంలో చైన్‌ స్నాచింగ్‌ కలకలం; మహిళకు స్వల్ప గాయాలు

చంపుతానని బెదిరించి.. మహిళ మెడలోంచి చైన్‌ అపహరించిన వైనం

ఘటనా స్థలాన్ని సందర్శించిన రూరల్‌ సీఐ కోటేశ్వర్‌రావు, గౌరారం ఎస్సై వీరన్న

సాక్షి, గజ్వేల్‌: ఒంటరిగా వెళ్తున్న మహిళను సైకిల్‌పై వెంబడించి, కిందపడేసి, చంపుతానని బెదిరించి గుర్తు తెలియని దొంగ నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయిన ఘటన గురువారం ఉదయం వర్గల్‌ మండలం గౌరారం శివారులో జరిగింది. ఈ ఘటనలో మహిళ మెడపై గాయాలయ్యాయి. స్థానికంగా చికిత్స జరిపించుకున్నది. ఘటన స్థలాన్ని గజ్వేల్‌ రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  

వెంబడించి.. భయపెట్టి 
గౌరారం గ్రామానికి చెందిన నగరం శశిరేఖ (58) గురువారం ఉదయం తమ పొలం దగ్గరకు వెళ్లే మార్గంలో పంటి నొప్పి నివారణ చెట్టు ఆకు కోసం బయల్దేరింది. తుమ్మ చెట్లు, పొదలతో కూడిన ఆ బాటలో వెళ్తున్న ఆమెను అదే మార్గంలో సైకిల్‌పై వస్తున్న గుర్తు తెలియని ఆగంతకుడు వెంబడించాడు. ఆమె ఆకుల కోసం చెట్టు వద్దకు చేరుకోగానే చెప్పులు లేకుండా వెళ్తున్నావేంటని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆమె తేరుకునేలోగానే కిందపడేసి కొట్టి, ఎక్సా బ్లేడ్‌ (పైపులు కోసే చిన్న రంపం)తో చంపుతానని బెదిరించాడు. మెడపై గాట్లు పెట్టాడు. భయంతో ఆమె చంపొద్దని వేడుకోగా మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించుకుని ఆగంతకుడు సైకిల్‌ మీద అక్కడి నుంచి ఉడాయించాడు.

ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న వారు ఆగంతకుని కోసం వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘటన స్థలాన్ని రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాబరీ కేసు నమోదు చేశామని ఎస్సై వీరన్న తెలిపారు. చైన్‌ స్నాచర్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు రూరల్‌ సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని వివరించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

మరిన్ని వార్తలు