ఐదేళ్లకు వచ్చి చిక్కాడు!

4 Aug, 2018 11:20 IST|Sakshi

చైన్‌ స్నాచర్‌ జలాల్‌ను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

గత నెల 26న నగరానికి రాక

పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు

సాక్షి, సిటీబ్యూరో: విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన డబ్బు కోసం స్నాచింగ్స్‌కు పాల్పడి, ఆ డబ్బుతోనే సౌదీ పారిపోయిన గొలుసు దొంగ మహ్మద్‌ జలాల్‌ ఇస్మాయిల్‌ ఎట్టకేలకు చిక్కాడు. ఐదేళ్లుగా నగర పోలీసులకు వాంటెడ్‌గా ఉన్న ఇతడిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఇన్నాళ్లు విదేశాల్లో జలాల్‌ రాక కోసం ఎదురు చూస్తూ, క్రమం తప్పకుండా నిఘా ఉంచిన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఇతడిని పట్టుకోగలిగింది. ఫలక్‌నుమలోని తీగలకుంట ప్రాంతానికి చెందిన జలాల్, అఫ్జల్‌గంజ్‌ ఫ్రూట్‌ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇలా వచ్చిన సొమ్ముతో తాను ఆశించిన విధంగా బతకలేకపోవడంతో సౌదీకి వెళ్లి డబ్బు సంపాదించాలని భావించాడు. అందుకు తన వద్ద నగదు లేకపోవడంతో చైన్‌ స్నాచింగ్స్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. 2013లో సిటీలో స్నాచర్ల హల్‌చల్‌ ఎక్కువగా ఉండటంతో ఈ మార్గం ఎంచుకున్నాడు. కాలాపత్తర్‌లోని మిశ్రీగంజ్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ అస్ఘర్‌ అలీ జలాల్‌తో జట్టు కట్టాడు.

నల్లరంగు కరిజ్మా ఖరీదు చేసిన ఈ ద్వయం రంగంలోకి దిగింది. అస్ఘర్‌ బైక్‌ నడుపుతుండగా వెనుక కూర్చునే జలాల్‌ నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్‌ చేసేవాడు. కొద్ది రోజుల్లోనే వరుసపెట్టి ఎనిమిది స్నాచింగ్స్‌ చేసిన ఈ ద్వయం ఆ సొత్తును అమ్మగా వచ్చిన సొమ్మును పంచుకుంది. ఈ డబ్బుతో 2013 జూలై 31న జలాల్‌ సౌదీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కాలాపత్తర్‌కే చెందిన షేక్‌ మాజిద్‌తో ముఠా కట్టిన అస్ఘర్‌ అలీ తన ‘పరంపర’ను కొనసాగించాడు. మొత్తం 28 స్నాచింగ్స్‌ చేసిన తర్వాత 2013 సెప్టెంబర్‌ 2న అస్ఘర్, మాజిద్‌  సైదాబాద్‌ పోలీసులకు చిక్కారు. వీరి నుంచి పోలీసులు 1.8 కేజీల బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే జలాల్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇతడి కోసం ఆరా తీయగా అప్పటికే సౌదీకి వెళ్లిపోయినట్లు తేలింది. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఇటీవల వాంటెడ్‌ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా జలాల్‌ తరహాలో పరారీలో ఉన్న వారి కదలికలను ఎప్పకప్పుడు గమనిస్తూ ఓ కన్నేసి ఉంచింది. ఈ నేపథ్యంలోనే గత నెల 26న ఇతగాడు సౌదీ నుంచి వచ్చినట్లు గుర్తించింది. సిటీకి వచ్చిన జలాల్‌ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన మకాం ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చాడు. నిఘా ముమ్మరం చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం శుక్రవారం జలాల్‌ను పట్టుకుంది. దాదాపు ఐదేళ్లుగా వాంటెడ్‌గా ఉన్న ఇతడిని సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు