మూడు నెలల్లో మూడోసారి!

19 Feb, 2020 08:32 IST|Sakshi
పట్టుబడిన నిందితులు

కటకటాల్లోకి చేరిన చోరులు

మరో ఇద్దరితో కలిసి దొంగతనాలు

పట్టుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ద్విచక్ర వాహనాలు చోరీ, సెల్‌ఫోన్స్‌ స్నాచింగ్స్‌ చేస్తూ రెచ్చిపోతున్న చోరులు మరోసారి చిక్కారు. దీంతో కలిపి వీరిలో ఓ నిందితుడు, గడచిన మూడు నెలల్లో వీరు కటకటాల్లోకి చేరడం ఇది మూడోసారి. తాజాగా రెండు వాహనచోరీలు, రెండ్‌ సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ కేసుల్లో ఇద్దరిని వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి ఓ బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. ఫీల్‌ఖానా ప్రాంతానికి చెందిన షేక్‌ అస్లం వస్త్రదుకాణంలో సహాయకుడిగా పని చేస్తున్నాడు. హబీబ్‌నగర్‌ పరిధిలోని శాంతి నగర్‌కు చెందిన నసీర్‌ ఖాన్‌ మల్లేపల్లిలోని కిరాణా దుకాణంలో పని చేస్తున్నాడు. వీరిద్దరూ బాల్యస్నేహితులు. మల్లేపల్లికి చెందిన విద్యార్థి సోహైల్‌ ఫర్దీన్‌ ఖాన్‌ వీరితో జట్టుకట్టాడు. ఈ త్రయం జల్సాలకు అవసరమైన డబ్బు కోసం వాహన దొంగతనాలు, సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టారు. గతంలో నాంపల్లి, హుమాయున్‌నగర్, సైఫాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌ పరిధుల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడ్డారు. సాహిల్, నసీర్‌లను గత ఏడాది డిసెంబర్‌ 19న సైఫాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజులకు సోహైల్, 12 రోజులకు నసీర్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు.

గత నెలలో సోహైల్‌ను హబీబ్‌నగర్‌ పోలీసులు మరో కేసులో జైలుకు పంపారు. ఈ కేసులో బయటకు వచ్చిన అతగాడు మిగిలిన ఇద్దరినీ తరచు కలుస్తుండేవాడు. మద్యం, గంజాయి తదితరాలకు అవసరమైన ఖర్చుల కోసం మళ్లీ నేరాలు చేయడానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి వేళల్లో సంచరిస్తూ ద్విచక్ర వాహనాల దొంగతనాలు, రోడ్డుపై వెళ్తున్న వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్‌ స్నాచింగ్స్‌ ప్రారంభించారు. మార్కెట్, బేగంపేట ఠాణాల పరిధి నుంచి వాహనాలు, షాహినాయత్‌గంజ్, సైఫాబాద్‌ పరిధుల నుంచి సెల్‌ఫోన్లు తస్కరించారు. వాహనంపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న సోహైల్‌ను పట్టుకున్న హబీబ్‌నగర్‌ పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో ఆ వాహనం మార్కెట్‌ పరిధి నుంచి చోరీ చేసిందని తేలడంతో ఆ ఠాణాకు అప్పగించారు. ఇతడితో కలిసి నేరాలు చేసిన మిగిలిన ఇద్దరి కోసం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు, పి.మల్లికార్జున్, మహ్మద్‌ ముజఫర్‌ అలీ, ఎన్‌.రంజిత్‌కుమార్‌ రంగంలోకి దిగారు. మంగళవారం ఇరువురినీ పట్టుకుని వీరి నుంచి మరో బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని మార్కెట్‌ పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు