30 గంటల్లో పట్టేశారు..!

29 Jul, 2019 08:15 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌

స్నాచింగ్‌ కేసులో నిందితుల అరెస్ట్‌

ఖర్చుల కోసం చోరీకి పాల్పడిన యువకులు

అంబర్‌పేట ప్రాంతంలో శనివారం స్నాచింగ్‌

ఆదివారం ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఈస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న అంబర్‌పేటలోని సాయిబాబ దేవాలయం వద్ద చోటు చేసుకున్న చైన్‌ స్నాచింగ్‌ కేసును పోలీసులు 30 గంటల్లో ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన ఇద్దరు యువకులతో పాటు వారికి సహకరించిన మరొకరినీ ఆదివారం అరెస్టు చేశారు. శనివారం ఉదయం 9.40 గంటలకు జరిగిన ఈ నేరంపై మధ్యాహ్నం 11 గంటలకు ఫిర్యాదు అందిందని, ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిందితులను పట్టుకోవడంతో పాటు సొత్తు రికవరీ చేసినట్లు నగరపోలీస్‌ కమిసనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ గోవింద్‌రెడ్డి, మలక్‌పేట ఏసీపీ ఎం.సుదర్శన్‌లతో కలిసి ఆదివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాచిగూడ ప్రాంతానికి చెందిన హర్షజోషి, పట్లకూరి మనోజ్‌కుమార్, ఠాకూర్‌ అశ్విన్‌ సింగ్‌ స్నేహితులు. హర్ష ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ కావడంతో ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. మనోజ్‌ ఓ సంస్థలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా, అశ్విన్‌ ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మనోజ్‌ తన స్నేహితుడైన అశ్విన్‌ ఇంటి వెళ్లి రూ.3 వేలు చేబదులు కావాలని కోరాడు. తన వద్ద కూడా డబ్బు లేదని చెప్పిన అశ్విన్‌ తనకూ ఆ అవసరం ఉందని చెప్పాడు. దీంతో అశ్విన్‌ చైన్‌ స్నాచింగ్‌ చేయడం ద్వారా తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, ఆ నేరాలు చేద్దామని చెప్పడంతో దీనికి అంగీకరించిన మనోజ్‌ స్నాచింగ్‌ చేయడానికి బైక్‌ వేగంగా డ్రైవ్‌ చేయాలని, ఆ నైపుణ్యం ఉన్న హర్షను తమతో కలుపుకుందామని చెప్పాడు. ఈ విషయం హర్షకు చెప్పడంతో అతనూ అంగీకరించాడు. తన పల్సర్‌ బైక్‌ను వారిద్దరికీ ఇచ్చిన అశ్విన్‌ ఓ యాక్టివాను తీసుకున్నాడు. పల్సర్‌పై హర్ష, మనోజ్‌ ఉండగా.. యాక్టివాను అశ్విన్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు.

వీరు ముగ్గురూ కలిసి శనివారం ఉదయం అంబర్‌పేటలోని పలు ప్రాంతాల్లో కలియ తిరిగారు. పల్సర్‌కు 50 మీటర్ల ముందు యాక్టివాపై వెళుతున్న అశ్విన్‌ టార్గెట్స్‌ ఎంచుకోవడంలో మిగిలిన ఇద్దరికీ సహకరించాడు. అదే సమయంలో డీడీ కాలనీకి చెందిన అనసూయ తన సోదరి విట్చయతో కలిసి టీఆర్టీ కాలనీలోని దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి వద్దకు వెళ్లిన హర్ష, మనోజ్‌ అనసూయ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు లాక్కుపోయారు. అనంతరం ముగ్గురూ విద్యానగర్‌ మీదుగా కాచిగూడ వెళ్లి చోరీ సొత్తును పంచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న ఈస్ట్‌జోన్‌ పోలీసులు డీఐలు నేను నాయక్, సైదులు, బి.రమేష్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఘటనాస్థలితో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల  అధ్యయనం చేశారు. స్నాచింగ్‌ సమయంలో హెల్మెట్‌ పెట్టుకుని, నెంబర్‌ ప్లేట్‌ లేని పల్సర్‌ నడిపిన హర్ష అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన కొద్దిసేపటికి హెల్మెట్‌ తీసేయడంతో పాటు తాను వేసుకున్న డ్రస్‌ కూడా మార్చేశాడు. ప్రత్యేక బృందంలో ఉన్న మలక్‌పేట కానిస్టేబుల్‌ అమర్‌నాథ్‌ సీసీ కెమెరా ఫీడ్‌లో మనోజ్‌ను గుర్తించాడు. ఈ ఆధారంతో పోలీసులు ఆదివారం కాచిగూడ ప్రాంతంలో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని వాహనాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు