చెలరేగిపోయిన చైన్‌స్నాచర్లు

18 Jan, 2019 07:24 IST|Sakshi
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సేకరించిన దుండగుల చిత్రం

ముగ్గురు మహిళల మెడల్లోని

15 తులాల బంగారు ఆభరణాల అపహరణ

చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. పట్టపగలే ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. అగనంపూడి సమీప రాజీవ్‌నగర్‌ సమీపంలోనూ, ఎంపీవీ కాలనీలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి

విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): స్నేహితురాలితో కలిసి మార్కెట్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసు తెంపుకొని పరారైన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. దువ్వాడ క్రైం ఎస్‌ఐ సంతోష్‌ తెలిపిన వివరాల ప్రకారం... రాజీవ్‌నగర్‌ సమీపంలోని శివసాయినగర్‌కు చెందిన దేవినేని పద్మ ఆమె స్నేహితురాలితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రాజీవ్‌నగర్‌ మార్కెట్‌కు నడిచి వెళ్తున్నారు. మార్కెట్‌కు సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గ్రే కలర్‌ స్కూటీపై ఆమె పక్క నుంచి వాహనాన్ని పోనిచ్చి పద్మ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాయి. నిందితులను వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్‌నగర్‌ కూడలిలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులను నిందితుల చిత్రాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంవీపీ కాలనీలో...
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పట్టపగలు రోడ్డుపై చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళల మెడలులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు దొంగతనాలకు పాల్పడిందని ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 6 రోడ్డుపై నుంచి వస్తున్న ఎస్‌.రమావేది మెడలోని  నాలుగు తులాల బంగారు చైనుని బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకుని పరారయ్యారు. సెక్టార్‌ – 6 నుంచి మహాత్మాగాంధీ ఆస్పత్రికి వచ్చే రోడ్డులో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎస్‌.రమాదేవి (64) నడుచుకుని వస్తుండగా ఈ  చైన్‌స్నాచింగ్‌ జరిగింది. నాలుగు తులాల బరువుగల చైన్‌ తెంపుకుని దుండగులు ఉడాయించారు. అలాగే ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 8 సత్యసాయి బాబా పాఠశాల రోడ్డులో టి.సావిత్రి (51) నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు 7 తులాల బంగారు చైను, నల్లపూసలు దండ తెంపుకుని పరారయ్యారు. ఈ రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన దొంగలు మెడలోని ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్‌ క్రైం ఎస్‌ఐ సూరిబాబు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు