లైవ్‌లో అరెస్ట్‌ చేసిన పోలీసులు

15 Jan, 2020 21:10 IST|Sakshi

చంఢీగఢ్‌ : ఓ వ్యక్తి తను చేసిన హత్యల గురించి ఓ టీవీ షో లైవ్‌లో నోరువిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. హత్యలు జరిగిన పదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు ఈ ఘటన చంఢీగఢ్‌లో బుధవారం చోటు చేసుకుంది. చంఢీగఢ్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మహీందర్‌ సింగ్‌ ఓ టీవీ షో లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను 2010లో తన ప్రేయసి సరబ్జిత్‌ కౌర్‌ను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆమెకు తన బావతో ఎఫైర్‌ ఉందని అందుకే చంపాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని పిలిచి చంఢీగఢ్‌లోని ఓ హోటల్‌లో ఆమెను హతమార్చానని అంగీకరించాడు.

దీంతో పోలీసులు ఉన్నపలంగా టీవీ చానల్‌ స్టూడియోకు చేరుకుని అతన్ని లైవ్‌లోనే అరెస్టు చేశారు. కాగా అతను తన మరో ప్రేయసిని హతమార్చిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. దీనిపైన కూడా లైవ్‌లో అతను నోరు విప్పాడు. ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో ప్రేమాయణం జరుపుతోందని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. దీనిపై అతను ఇప్పటికే శిక్ష అనుభవిస్తుండగా గత కొంతకాలంగా బెయిల్‌పై తిరుగుతున్నాడు.

మరిన్ని వార్తలు