ఎయిర్‌ ఏషియా స్కాం : చంద్రబాబు పేరు

4 Jun, 2018 18:49 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

న్యూఢిల్లీ : ఎయిర్‌ ఏషియా కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అంతర్జాతీయ విమానయానానికి కావాల్సిన పర్మిట్లను తెచ్చుకునేందుకు ఎయిర్‌ ఏషియా అడ్డదారులు తొక్కిన విషయం తెలిసిందే. పర్మిట్ల కోసం విమానయాన శాఖ ఉద్యోగులకు ఎయిర్‌ ఏషియా లంచాలు ఎర వేసింది. దాదాపు పది లక్షల డాలర్లను లంచాలను విమానయాన శాఖ అధికారులు స్వీకరించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అంచనా వేసింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి సూచించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఇప్పటికే పలువురు పౌర విమానయాన శాఖ ఉద్యోగులను అరెస్టు చేసింది.

అవినీతి కేసును తవ్వితీస్తున్న సమయంలో సీబీఐకు ఎయిర్‌ ఇండియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, అతని వద్ద పని చేసే ఉద్యోగి మిత్తూ ఛాండిల్యాల మధ్య 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణ ఆడియో టేపు సీబీఐ చేతికి చిక్కింది. ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఈ ఆడియో టేపులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్‌ గజపతి రాజు పేర్లు ఉన్నాయి. అడ్డదారిలో పర్మిట్లు రావాలంటే చంద్రబాబును పట్టుకోవాలని ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌, ఎయిర్‌ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యాల మధ్య సంభాషణలు జరిగాయి.

ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌(ఎడమ), ఎయిర్‌ ఏషియా ఇండియా సీఈవో మిత్తూ ఛాండిల్యా(కుడి)

‘చంద్రబాబును పట్టుకుంటే మనకు కావాల్సిన పని అయిపోతుంది. ఆయన మనిషే కేంద్రంలో విమానాయాన శాఖ మంత్రి. అసలు దారిలో వెళ్తే చాలా సమయం పడుతుంది. అడ్డదారిలో వెళ్లి పని చేయించుకోవాలి. చంద్రబాబును మన వైపు తిప్పుకుంటే ఏ పనైనా పూర్తవుతుందని గతంలో అశోక్‌ గజపతి రాజే చెప్పారు.’  అని ఆడియో టేపులో ఛాండిల్యా మాట్లాడారు.

అయితే, ఈ ఆడియో టేపు ఎప్పటిదో తెలియాల్సివుంది. బీజేపీతో తెగదెంపుల సందర్భంగా అశోక్‌ గజపతి రాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎయిర్‌ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్‌ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు