నెత్తుటి సిరాతో.. ‘జిత్తుల’ లేఖ

13 Jan, 2019 03:24 IST|Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చిన్న ఘటనే అంటూ సర్కారు దబాయింపు

ఎన్‌ఐఏతో దర్యాప్తు అంటే రాష్ట్ర అధికారాలపై దురాక్రమణే అంటూ ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ

భద్రతా అంశం కేంద్రానిది.. దర్యాప్తు మేం చూసుకుంటామన్న సీఎం 

కేంద్ర చట్టాలకు వక్రభాష్యం చెబుతూ దర్యాప్తును అడ్డుకునే ఎత్తుగడ

తమ బండారం వెలుగులోకి వస్తోందని ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన

ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఎన్‌ఐఏ పరిధిలోకే వస్తుందని తేల్చిచెబుతున్న చట్టాలు

సాక్షి, అమరావతి బ్యూరో: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను వ్యతిరేకిస్తూ ఈ కేసు సంగతి తామే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించేలా టీడీపీ సర్కారు లేఖ రాయడంపై రాజకీయ పరిశీలకులు, న్యాయ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఈ దారుణ హత్యా యత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎయిర్‌పో ర్టులో భద్రత బాధ్యత కేంద్రానిది, విచారణ మాత్రం తాము చూసుకుంటామంటూ సీఎం వింత వ్యాఖ్యలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభమై చురుగ్గా సాగుతుండటంతో తమ బండారం బయటపడుతుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు అంశం కేంద్ర పరిధిలోకి రాదని, ఇది చాలా చిన్న కేసు అని బుకాయించేలా ప్రధానికి శనివారం రాసిన లేఖలో చంద్రబాబు  పేర్కొన్నారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర సంబంధాలుగా చిత్రీకరిస్తూ రాష్ట్రం అధికారాలపై దురాక్రమణగా సీఎం అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. విమానాశ్రయాల్లో స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, విదేశీ చొరబాట్లపైనే ఎన్‌ఐఏ విచారణ జరపాలని చట్టంలో ఉందటూ సీఎం చంద్రబాబు వక్రీకరిస్తూ అవాస్తవాలు చెప్పడం గమనార్హం. చిన్న కేసులు, ఆర్థికపరమైన కేసులు మినహా హత్యాయత్నాలు, హత్యలు, లాంటి తీవ్రమైన కేసుల విచారణను ఎన్‌ఐఏ చేపట్టకూడదని చెప్పడం చంద్రబాబుకే సాధ్యమని పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. 

కేసును నీరుగార్చేలా సీఎం, డీజీపీ వ్యాఖ్యలు
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్యాయత్నం జరిగిందని కేసుపై తొలుత దర్యాప్తు జరిపిన సిట్‌ అధికారులు సైతం హైకోర్టుకు సమర్పించిన రిమాండ్‌ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు స్పందిస్తూ దీన్ని అభిమాని చేసిన దాడిగా చిత్రీకరిస్తూ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కేంద్ర సంస్థతో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ న్యాయ పోరాటం చేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ కేసు విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయడాన్ని నివేదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని తెలిపింది. కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం, ఎన్‌ఐఏ చట్టాలను ఉటంకిస్తూ ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ కేంద్ర హోంశాఖ స్పందనను కోరింది. విమానాశ్రయంలో జరిగిన ఈ హత్యాయత్నం కేసును చట్ట ప్రకారం ఎన్‌ఐఏకు అప్పగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి తెలియచేయడం, రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థ చురుగ్గా విచారిస్తుండటంతో కుట్రదారులు ఆందోళన చెందుతున్నట్లు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాల్సిందేనంటున్న చట్టం
నిజానికి విమానాశ్రయంలో హత్యాయత్నాలు, హత్యలు, దాడుల కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు చేపట్టకూడదని ఎన్‌ఐఏ చట్టం సెక్షన్‌ 6 స్పష్టం చేస్తోంది. ఇక విమానాశ్రయంలో ఏదైనా ఆయుధం, వస్తువుతో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడితే ఎన్‌ఐఏ విచారణ పరిధిలోకి వస్తాయని పౌర విమానయాన భద్రతా చట్టంలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యలు భారత సమాఖ్య వ్యవస్థ విధానానికి విరుద్ధమని చంద్రబాబు అవాస్తవాలు చెప్పడం సీఎం స్థాయిని దిగజార్చిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎలా దర్యాప్తు చేపడుతుందని చంద్రబాబు తన లేఖలోప్రధానిని ప్రశ్నించారు. విమానాశ్రయం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస్థ. అక్కడ జరిగిన హత్యాయత్నం కేసు విచారణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందన్న  విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మాలేగావ్‌ అల్లర్ల కేసులో ఓ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌పై ఎన్‌ఐఏ ఉన్నతాధికారి ఒకరు ఒత్తిడి తెచ్చారంటూ ఓ ప్రతికలో వచ్చిన వార్తను చంద్రబాబు ప్రస్తావిస్తూ ఎన్‌ఐఏ నిబద్ధతను ప్రశ్నించారు. మరి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం సానుభూతికోసమేనంటూ స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు డీజీపీ బహిరంగ వ్యాఖ్యలు చేసిన తరువాత రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు ఎలా నిర్వహిస్తారని నిపుణులు నిలదీస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏ విచారణ పరిధిలోకే వస్తుందని కేంద్ర పౌర విమానయాన భద్రతా చట్టం–1982, ఎన్‌ఐఏ చట్టాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. విమానాశ్రయాల్లో భద్రత, రక్షణకు విఘాతం కలిగించే నేరాలపై దర్యాప్తు బాధ్యత పూర్తిగా ఎన్‌ఐఏదేనని పౌర విమానయాన భద్రతా చట్టంలోని సెక్షన్‌ 3(ఎ), 5(ఎ)లు స్పష్టం చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో భద్రతకు భంగం కలిగించే చర్యలు, హత్యాయత్నాలు, దాడులు తదితర కేసులను ఎన్‌ఐఏ విచారించాలని వివరంగా  పేర్కొన్నారు. ఏదైనా విమానాశ్రయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఏదైనా ఆయుధాన్నిగానీ వస్తువునుగానీ ఉపయోగించిన కేసులను ఎన్‌ఐఏ విచారించాలి. హింసాత్మక చర్యలకు పాల్పడి ఎవరినైనా గాయపరిచినా, హత్యలకు పాల్పడినా ఆ కేసులు ఎన్‌ఐఏ దర్యాప్తు పరిధిలోకే వస్తాయి. 

కుట్ర కోణాన్ని వెలికి తీసే సెక్షన్లను చేర్చకుండా...
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో మెలిగే వారికి దీన్ని అప్పగించి వ్యూహాత్మకంగా విచారణను నీరుగార్చేందుకు యత్నించింది. 2018 అక్టోబరు 25వతేదీ మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో నిందితుడు శ్రీనివాసరావు హత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయితే ప్రాథమిక విచారణ కూడా పూర్తికాకముందే అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకే డీజీపీ ఠాకూర్‌ విలేకరుల సమావేశం నిర్వహించి ‘సానుభూతి కోసమే నిందితుడు శ్రీనివాసరావు జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు’ అని ప్రకటించేశారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు అదే మాట చెప్పుకొచ్చారు. సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ‘సానుభూతి కోసమే ఈ హత్యాయత్నం చేయించారు’ అని బాధ్యతారాహిత్యంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రకటన చేశారు. విమానాశ్రయంలోని తన రెస్టారెంట్‌లో నిందితుడికి ఏడాదికిపైగా ఆశ్రయం ఇచ్చిన టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరిని సిట్‌ అధికారులు సరిగా విచారించ లేదు. నిందితుడు శ్రీనివాసరావుకు  ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌(ఏఈపీ) జారీకి అవసరమైన నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌వోసీ)కు సంబంధించి కూడా విశాఖ పోలీస్‌ కమిషనర్‌ తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు అవసరమైన ‘సెక్షన్‌ 120–బి’ చేర్చనేలేదు. హత్యాయత్నం కేసులో అసలు సూత్రధారుల పాత్ర బట్టబయలు కాకుండా కేవలం శ్రీనివాసరావుకే పరిమితం చేసేలా ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో పోలీసులు కథ నడపడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు