చంద్రయ్య యాదవ్‌ అరెస్టు 

28 Feb, 2018 02:01 IST|Sakshi
పోలీసుల అదుపులో చంద్రయ్య యాదవ్‌

జగద్గిరిగుట్ట: బాచుపల్లి గ్రామంలోని 32 ఏకరాల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో ప్రధాన సూత్రధారి పోతరాజు రామచంద్రుడు అలియాస్‌ చంద్రయ్య యాదవ్‌(53)ను  బాచుపల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఎస్‌హెచ్‌ఓ బాలక్రిష్ణారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీహెచ్‌ చౌదరి దామోదర్‌రావు అనే వ్యక్తి ఈ నెల 14న సర్వే నంబర్‌ 140,141లోని తన  భూమి 32.33 ఎకరాలు అక్రమించుకోవడానికి కొందరు నకిలీ పత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందుకుగాను అక్రమార్కులు బుక్‌ –1,వ్యాలూమ్‌–440లో 7 మార్టిగేజ్‌ డ్యాక్యూమెంట్‌ డిడ్స్‌ తొలగించి వాటి స్థానంలో 6 తప్పుడు సేల్‌ డీడ్‌ పత్రాలు ఉంచారు. ఇందుకుగాను ప్రధాన నిందుతుడు చంద్రయ్య యాదవ్‌ రబ్బర్‌ స్టాంప్‌లు తయారీ మెషిన్‌ను కొనుగోలు చేసి దాని ఆధారంగా ఎస్‌ఆర్‌ఓ ఆఫీస్‌ స్టాంప్‌లు తయారు చేసినట్లు తెలిపారు. నకిలీ డీడ్‌లు షాపూర్‌నగర్‌లోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద టైప్‌ చేయించి దానికి సేల్‌ డీడ్‌ డ్రాఫ్ట్‌లను తన ల్యాప్‌టాప్‌లో స్వయంగా  తయారు చేశాడు.

ఎస్‌ఆర్‌ఓ కార్యాలయ సిబ్బంది సాయిబాబా, మురళీలకు రూ. 5 లక్షలు లంచం ఇచ్చి బుక్‌–1,వ్యాలూమ్‌ 440లోని ఒరిజినల్‌ మార్టిగేజ్‌ డాక్యుమెంట్లను తొలగించి వాటి స్థానంలో 6 నకిలీ పత్రాలు చేర్చాడు. భూమి యాజమాని చనిపోయినట్లుగా తెలుసుకుని మృతుడు కృష్ణమూర్తి  తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన పద్దిరెడ్డికి విక్రయించినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. అయితే పద్దిరెడ్డి సైతం చనిపోయిన తరువాతే ఈ వ్యవహారం నడపడం గమనార్హం. దీనికితోడు గాజులరామారం, సూరారం తదితర ప్రాంతాల్లో సైతం మరో ఐదు నకిలీ పత్రాలు సృష్టించాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్నట్లు తెలుసుకున్న చంద్రయ్య యాదవ్‌ తన వద్ద ఉన్న  బుక్‌–1, వ్యాలూమ్‌440 నుంచి తొలగించిన ఒరిజినల్‌ మార్టిగేజ్‌ పత్రాలు , నకీలీ సేల్‌ డీడ్‌లు ,రబ్బర్‌ స్టాంప్‌లను తీసుకెళ్లి కిష్టాయిపల్లి గ్రామం పరిధిలో ఉన్న వ్యవసాయ భూమిలో తగుల బెట్టాడు. చంద్రయ్య యాదవ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతని ల్యాప్‌ టాప్, ప్రింటర్, రబ్బర్‌ స్టాప్‌ మేకింగ్‌ మిషన్, ఖాళీ రబ్బర్‌ స్టాప్‌లతో పాటు, 6 మొబైల్‌ ఫోన్‌లు, బైక్, కారులను సీజ్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు