మదరసాలో కీచకపర్వం

13 Jul, 2019 13:24 IST|Sakshi

లైంగికంగా వేధించి.. పెళ్లి చేసుకున్న పర్యవేక్షకుడు    

ముస్లిం మత పెద్దలు, నాయకుల ఆందోళన  

గుంటూరు జిల్లా చాపలగడ్డలో ఘటన 

నిందితుడిపై కేసు నమోదు

సాక్షి, దాచేపల్లి: మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై మదరసా నిర్వాహకుడు కన్నేశాడు. బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది.

విషయం తెలుసుకున్న ముస్లిం మతపెద్దలు, నాయకులు మదరసా వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు, ముస్లిం నేతల కథనం ప్రకారం.. ఆలిం కోర్సు చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బాలికలు మదరసాలో చేరారు. షేక్‌ ముఫ్తీ అబ్దుల్‌ సత్తార్‌ దీనిని పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. మదరసాలోని 17 ఏళ్ల బాలికపై ఆయన కన్నేసి.. కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక, సత్తార్‌ కలిసి ఉండటాన్ని మిగతా విద్యార్థినులు గమనించి నిలదీశారు.

ఈ విషయం ముస్లిం మతపెద్దలు, నాయకుల దృష్టికెళ్లడంతో వారంతా శుక్రవారం మదరసా వద్దకు వచ్చి అబ్దుల్‌ సత్తార్, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. వారం కిందటే తాను బాలికను వివాహం చేసుకున్నట్లు అబ్దుల్‌ సత్తార్‌ చెప్పాడు. మత సంప్రదాయాలకు విరుద్ధంగా, మైనార్టీ కూడా తీరని బాలికను ఎలా వివాహం చేసుకున్నావంటూ వారు నిలదీయటంతో అక్కడ నుంచి ఉడాయించాడు. 

పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు
ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. మదరసా ఖాళీ చేయాలని డిమాండ్‌ చేయడంతో అబ్దుల్‌ సత్తార్‌ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులను పిలిపించి మదరసా నుంచి పిల్లలను పంపించారు.

అబ్దుల్‌ సత్తార్‌ కుటుంబ సభ్యులను బయటకు పంపేలా.. మదరసా నిర్వహణకు సహకారం అందించే ముస్లింలతో పాటు మతపెద్దలు తీర్మానం చేశారు. గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ కోటేశ్వరరావు కూడా మదరసాను సందర్శించి జరిగిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమక్షంలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అబ్దుల్‌ సత్తార్‌ తనను బెదిరించి లైంగిక దాడి చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
  

మరిన్ని వార్తలు