రుణాల పేరిట 600 మందికి టోకరా..!  

26 Mar, 2019 03:42 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న టెలిఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, వివరాలు వెల్లడిస్తున్న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్, షికా గోయల్‌

రెండు కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి వల

దాదాపు రూ.25 కోట్లు స్వాహా

ఎనిమిది మంది అరెస్టు, 54 మందికి నోటీసులు

పరారీలో ఉన్న సూత్రధారుల కోసం ముమ్మర గాలింపు

సాక్షి, హైదరాబాద్‌ : తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణాల పేరుతో ఎర వేసి అడ్వాన్స్‌ చెల్లింపుల పేరిట ఓటీపీ సహా బ్యాంకు వివరాలు సంగ్రహించి అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రట్టు చేశారు. రాజధానిలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్లపై దాడులు చేసి మొత్తం 62 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం వెల్లడించారు. ఈ గ్యాంగ్‌ దేశ వ్యాప్తంగా 600 మంది నుంచి దాదాపు రూ.25 కోట్లు స్వాహా చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేయగా... మిగిలిన 54 మందిని సైతం నిందితులుగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41 (ఏ) నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి, సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌లతో కలసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ పూర్తి వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు సూత్రధారులు పంజగుట్ట, బంజారాహిల్స్‌లో ఎలైట్‌ కనెక్ట్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. నగరంలోని రెండింటికీ ఎ.ఆశాకుమారి, బంజారాహిల్స్‌ వాసి రంగస్వామి గోపి మేనేజర్లుగా జె.భూపాల్‌రెడ్డి (చందానగర్‌), బి.సాయిరామ్‌ (కార్ఖానా), జి.నరేశ్‌ యాదవ్‌ (కర్మన్‌ ఘాట్‌), మెహజబీన్‌ ఖాన్‌ (సోమాజిగూడ), విజయలక్ష్మి (అమీర్‌పేట్‌), ఆర్‌.అపూర్వ (శంషాబాద్‌) టీమ్‌ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరి వద్ద మరో 60 మంది వరకు టెలీకాలర్లుగా, ఇతర ఉద్యోగులుగా పని చేస్తున్నారు. చెన్నైకి చెందిన సూత్రధారులు కొన్ని కాల్‌సెంటర్లకు చెందిన ఉద్యోగుల నుంచి అనేక మందికి చెందిన సెల్‌ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్నారు. ఒక్కో నంబర్‌ కోసం గరిష్టంగా రూ.5 వరకు వెచ్చిస్తున్నారు.

ఆ నంబర్ల సిరీస్‌ను బట్టి సీరియల్‌గా రాసుకుంటూ మరికొన్నింటిని రూపొందిస్తున్నారు. వీటి ఆధారంగా టెలీ కాలర్లు వారికి ఫోన్లు చేస్తుంటారు. తాము మహేంద్ర ఫైనాన్స్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకుంటారు. ఆపై గరిష్టంగా రూ.10 లక్షల వరకు కేవలం 6.5 శాతం వార్షిక వడ్డీకి వ్యక్తిగత రుణం అంది స్తామంటూ నమ్మబలుకుతారు. ఆసక్తి చూపిన వారికి తమ వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చి పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు తదితరాలను పంపాలని కోరతారు. వాటిని పరిశీలించి రుణం మంజూరైందంటూ మరోసారి కాల్‌ చేస్తారు. తమ కంపెనీ నిబంధనల ప్రకారం రుణ మంజూరుకు గాను రెండు నెలసరి వాయిదాలు ముందుగానే చెల్లించాలని చెప్పి, మాటల్లో పెట్టి డెబిట్‌కార్డు వివరాలు, ఓటీపీ తెలుసుకుని ఆ మొత్తాన్ని వారే బాధితుడి ఖాతా నుంచి జస్ట్‌ డయల్‌ పే–యూ ఖాతాలోకి మళ్లించుకుంటారు.

ఈ ఖాతాలన్నీ చెన్నైకి చెందిన సూత్రధారుల అధీనంలో ఉంటాయి. ఇక్కడి వారికి మాత్రం వారు నెల వారీ జీతాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ రకంగా ఈ గ్యాంగ్‌ దేశ వ్యాప్తంగా 10 వేల మందికి ఫోన్లు చేశారు. ఈ వివరాలన్నింటినీ తమ వద్ద ఉన్న పుస్తకాల్లో పొందుపరిచారు. వీరిలో 600 మంది వరకు రుణాలకోసం ఆసక్తి చూపటంతో వారి నుంచి రూ.25 కోట్లు స్వాహా చేశారు. ఏడాదిగా సాగుతున్న ఈ వ్యవహారంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఓ బాధితుడి ద్వారా సమాచారం అందింది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి వీరి కాల్‌సెంటర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.5 లక్షల రుణం మంజూరైందని ఆయన నుంచి బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు.

ఖాతా నుంచి రూ.32 వేలు కాజేశారు.అప్రమత్తమైన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్‌ డి.ప్రశాంత్, ఎస్సైలు జి.తిమ్మప్ప, పి.సురేశ్‌ల బృందాలు రెండు ప్రాంతాల్లో ఉన్న కాల్‌ సెంటర్లపై దాడులు చేశాయి. మొత్తం 62 మందిని అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించాయి. వీరి నుంచి రూ.80 వేల నగదు, ల్యాప్‌టాప్‌లు, రూటర్లు తదితరాలు స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.6 లక్షలు ఫ్రీజ్‌ చేశాయి. అదుపులోకి తీసుకున్న వారిలో ఎనిమిది మందిని అరెస్టు చేసి మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు. ఇలాంటి మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కొత్వాల్‌ అంజనీకుమార్‌ కోరారు. 
 

మరిన్ని వార్తలు