ఘరానా చీటర్‌!

31 Jan, 2020 09:54 IST|Sakshi
నిందితుడు మధు

బీమా పేరుతో రూ.3 లక్షలు స్వాహా

ఇంటి యజమాని బంధువుకే టోకరా

గతంలో చీఫ్‌ సెక్రటరీ పేరుతో మోసాలు

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ కాప్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ఫోన్‌ కాల్సే అతడి పెట్టుబడి.. వివిధ పేర్లు చెప్పి మోసాలు చేయడంలో దిట్ట.. గతంలో చీఫ్‌ సెక్రటరీ పేరుతో చీటింగ్‌ చేసి, ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ ఆఫీసర్‌ అంటూ టోకరా వేశాడు. ఈ మోసగాడిని గురువారం పట్టుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ నేపథ్యంలో సింగరేణిలో ఉన్నతోద్యోగినంటూ మరొకరికి టోకరా వేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఘరానా చీటర్‌ బానాల మధును అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి వెల్లడించారు. 

ఇలా సమాచారం సేకరించి..
కరీంనగర్‌ జిల్లా తాడిచెర్ల గ్రామానికి చెందిన మధు ప్రస్తుతం వరంగల్‌లోని విద్యానగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంటి యజమాని బంధువులు నగరంలోని ఖైరతాబాద్‌ సమీపంలో ఉన్న పంజగుట్ట మార్కెట్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. నగరంలో నివసించే వారిలో ఓ పెద్దాయన కొన్నాళ్ల క్రితం మరణించారు. ఈ విషయం తన ఇంటి యజమాని ద్వారా వారి వివరాలు, కుమారుడి ఫోన్‌ నంబర్‌తో పాటు చిరునామా సైతం తెలుసుకున్న మధు మోసానికి తెరలేపాడు. చనిపోయిన వ్యక్తి కుమారుడికి కాల్‌ చేసిన అతగాడు తాను ఓ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ తండ్రి తన వద్ద ఓ బీమా పాలసీ తీసుకున్నారని, దాని విలువ ప్రస్తుతం రూ.19 లక్షలుగా ఉందని నమ్మబలికాడు.

పన్నుల పేరుతో..  
అతడికి పూర్తిగా నమ్మకం కలగడానికి ఇంటి చిరునామా, సమీపంలోని ల్యాండ్‌ మార్క్స్‌ కూడా చెప్పాడు. దీంతో బాధితుడు మధు చెప్తున్నవి నిజమేనని భావించి ఇన్సూరెన్స్‌ను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలని అడిగాడు. దానికి వివిధ పన్నులు చెల్లించాల్సి ఉంటుందని, అలా కాకుంటే  ఇన్సూరెన్స్‌ మొత్తం రద్దు అవుతుందని బెదిరించాడు. దీంతో బాధితుడు చెల్లించడానికి అంగీకరించగా బ్యాంకు ఖాతాల నంబర్లు ఇచ్చిన మధు వివిధ దఫాల్లో రూ.3.2 లక్షలు డిపాజిట్‌ చేయించుకున్నాడు. డబ్బు చెల్లించినా బీమా మొత్తం రాకపోవడంతో బాధితుడు మధును సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించి కొన్ని రోజుల క్రితం సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. 

గతంలోనూ ఓసారి అరెస్టు...
కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ నేతృత్వంలో ఎస్సైలు పి.సురేష్, శాంతరావు దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు ఖాతాలు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా మధు నిందితుడని గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలో ఇతగాడు 2015లోనూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లినట్లు తేలింది. అప్పట్లో చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ శర్మ పేరుతో రాష్ట్రంలోని ఆరుగురు జెడ్పీటీసీలకు ఫోన్లు చేశాడు. కేంద్రం అందించే ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పాడు. అవి మీ పేరుతో రిలీజ్‌ చేయడానికి రూ.30 వేల చొప్పున చెల్లించాలంటూ తన స్నేహితుడి బ్యాంకు ఖాతా నెంబర్‌ ఇచ్చి కాజేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 2015 జూన్‌లో మధుతో పాటు అతడి స్నేహితుడు రాజశేఖర్‌ను అరెస్టు చేశారు.  

సింగరేణిలో ఉద్యోగం పేరుతో...
మధును అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అతడి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. అందులో రూ.2.4 లక్షలకు సంబంధించిన అనుమానిత లావాదేవీ పోలీసుల దృష్టిని ఆకర్షించింది. దీని ఆధారంగా ముందుకు వెళ్ళిన పోలీసులు మధు చేసిన మరో నేరాన్ని గుర్తించారు. నగరానికి చెందిన మరో యువకుడికి సింగరేణి సంస్థలో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్న ఇతగాడు అతడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఎర వేశాడు. దానికి అడ్వాన్స్‌ అని, ఇతర ఖర్చుల పేర్లు చెప్పి రూ.2.4 లక్షలు కాజేశాడని తెలుసుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న బాధితుడు గురువారం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వచ్చిన ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు. మధు నుంచి 20 గ్రాముల బంగారం, ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతిలో కస్టడీలోకి తీసుకుని విచారణ తర్వాత అతడి నేరాల చిట్టా బయటకు వస్తుందని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు