పోలీసుల వలలో మోసగాడు

31 Jul, 2019 04:11 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కరణం కుమార్‌

ఆర్బీఐ గవర్నర్, ప్రధాని పేరిట నకిలీ లెటర్‌ హెడ్లు సృష్టించి పలువురికి బురిడీ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అరెస్ట్‌ 

కాకినాడ క్రైం: రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 కోట్లు ఇస్తానని చెప్పి ప్రజలకు రూ.30 లక్షల వరకు టోకరా వేసిన ఘరానా మోసగాడిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి కారు, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి మోసాలను కాకినాడ డీఎస్పీ కరణం కుమార్‌ సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు మంగళవారం వివరించారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడకు చెందిన షేక్‌ సర్దార్‌ హుస్సేన్‌ అలియాస్‌ శివాజీ ఇరిడియం కాపర్‌ బిందెలతో కోట్లు సంపాదించవచ్చని నమ్మించి 15 మందిని మోసం చేసి రూ.30 లక్షలు వసూలు చేశాడు. ఇరిడియం కాపర్‌ బిందెలను అమ్మకానికి పెట్టి విదేశాల్లో కోట్ల రూపాయలను సంపాదించవచ్చని ప్రజలను నమ్మించాడు. అంతర్జాతీయ అణు సంస్థ, ఆర్కియాలజీ శాఖలో పనిచేస్తోన్న హనుమంతు అనే వ్యక్తి పేరుపై లెటర్‌హెడ్, ఆర్బీఐ గవర్నర్‌ లెటర్‌ ప్యాడ్, ప్రధాని మోదీ సంతకంతో ఓ నకిలీ లెటర్‌ హెడ్లను సృష్టించాడు.

ఆర్బీఐ నుంచి రూ.500 కోట్లు కంటైనర్‌లో వస్తుందని, ఇరిడియం అనే కాపర్‌ వస్తువు 230 ఏళ్ల క్రితందని, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌ వారు సర్టిఫై చేసిన నకిలీ పేపర్‌ను చూపించి నమ్మించాడు. తనకు రూ.5 లక్షలు ఇస్తే రూ.10 కోట్లు ఇస్తానని నమ్మించడంతో 2018 డిసెంబర్‌లో ఏలూరుకు చెందిన ఆదూరి హరిమోహన్‌ అనే వ్యక్తి రూ.5 లక్షలు హుస్సేన్‌కు ఇచ్చాడు. ఆ తరువాత హరిమోహన్‌ తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని హుస్సేన్‌ను ఒత్తిడి చేశాడు. కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట పంచాయతీ రాయుడుపాలెంలో ఓ లాడ్జి వద్దకు వస్తే రెండు రోజుల్లో రూ.500 కోట్లు వస్తున్నాయని అందులో నుంచి రూ.10 కోట్లు ఇస్తానని హరిమోహన్‌కు హుస్సేన్‌ చెప్పాడు. ఈయన మాటలు నమ్మి అక్కడికి వెళ్లగా అప్పటికే తనలా డబ్బులు ఇచ్చి మోసపోయిన 15 మంది ఉన్నారని, తనను రూమ్‌లోకి తీసుకువెళ్లి డబ్బులు కోసం అడిగితే చంపుతానని బెదిరించి హుస్సేన్‌ పారిపోయాడని హరిమోహన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులు హుస్సేన్‌తో పాటు అతడికి సహకరించిన విశాఖకి చెందిన పైలా సత్యవతి, సురేష్‌ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు