నయా మోసగాళ్లు!

8 Feb, 2019 09:43 IST|Sakshi
నిందితుల అరెస్టును చూపుతున్న ఏసీపీ బాలు జాదవ్‌

బెల్లంపల్లి: జనాల్లో ఉన్న మూఢనమ్మకాలే ఆ యుధంగా ఓ ముఠా టోపీ పెట్టేందుకు సిద్ధమైంది. ‘మరుగుమందు విక్రయం’ అంటూ పన్నాగం పన్నింది. కానీ, పోలీసుల అప్రమత్తతతో ఆ న యా మోసగాళ్ల వ్యూహం బెడిసికొట్టింది. కట్‌ చేస్తే.. ఆ ముఠా కటకటాలపాలైంది. ఈ సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ వి.బాలు జాదవ్‌ గురువారం రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇలా వెల్లడించారు.

మరుగుమందు పేరుతో కొందరు జనాలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారమందింది. దీంతో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ సీఐ సాగర్‌ టీమ్‌తోపాటు తాళ్లగురిజాల పోలీసులు సంయుక్తంగా బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామ శివారులోని ఓ  మామిడితోటలో బుధవారం ఆకస్మిక దాడి చేశారు. తోటలో మరుగుమందును అమ్మడానికి ప్రయత్నిస్తున్న తుమ్మిడ మల్లేష్‌ (చిన్న రాస్పల్లి, దహెగాం మండలం), ఎలుకారి అంజన్న(చిన్న రాస్పెల్లి, దహెగాం మండలం), చింతకింది రమేష్‌ (నవభారత్‌కాలనీ, రామకృష్ణాపూర్‌), పాగిడి మధుకర్‌  (దుగినేపల్లి, బెల్లంపల్లి), కొండగొర్ల రాజేష్‌(జన్కాపూర్, కన్నెపల్లి మండలం), జాడి స్వామి (బొప్పారం, నెన్నెల మండలం), కరెకొండ రామన్న(బొప్పారం, నెన్నెల మండలం), జావీద్‌ (ఐబీ, తాండూర్‌ మండలం), వొడ్నాల సాయివిజయ్‌( 24 డీప్‌ ఏరియా, బెల్లంపల్లి మున్సిపాలిటీ), టేకం గంగు (మాలగొండి, ఆసిఫాబాద్‌)ను అరెస్టు చేసినట్లు  ఏసీపీ వివరించారు. వారి నుంచి చెట్ల పసరు సీసాలు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

పన్నాగమేమిటంటే.. 
ఈ మోసగాళ్లు తాము తయారు చేసిన మందును ముందు కోడిపై ప్రయోగిస్తారు. అప్పుడు మందు రాసినవారు చెప్పినట్లు నడుచుకుంటుందని నమ్మిస్తారు. ఆ తర్వాత ఈ కుట్రను తమ ప్రయోగంగా చెప్పుకుంటూ మందును ప్రజలకు అమ్ముతారు. అంటే, మనుషులకు కూడా ఈ మందు రాస్తే.. రాసినవారి చుట్టూ రాయించుకున్న వారు తిరుగుతారని నమ్మిస్తారు. ఇలా నమ్మించి మందును అమ్మి కోట్లలో దండుకోవడమే వారి వ్యూహం. కేవలం ప్రజల నమ్మకాలను ఆసరా చేసుకుని సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురుద్దేశంతో మరుగుమందు పేరుతో సదరు ముఠా ఈ పథక రచన చేసినట్లు ఏసీపీ వివరించారు. 

మూఢనమ్మకాలు వీడాలి.. 
మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ప్రజలు నమ్మినంతా కాలం ఇలాంటి నయా మోసగాళ్లు పుడుతూనే ఉంటారని, ఇప్పటికైనా వీరితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ సాగర్, కానిస్టేబుళ్లు రాజేందర్, దేవేందర్, శేఖర్, సదానందం, హోంగార్డులు హైదర్, మహాంకాళితోపాటు తాళ్లగురిజాల పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. పట్టుబడ్డ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి రూరల్‌ సీఐ అల్లం నరేందర్, తాళ్ల గురిజాల ఎస్సై సీహెచ్‌.కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.   బాలుజాదవ్, ఏసీపీ

మరిన్ని వార్తలు