నకిలీ వైద్యుడిపై చీటింగ్‌ కేసు

29 Sep, 2017 10:49 IST|Sakshi
ఏంగల్స్‌రాజాతో మాట్లాడుతున్న ప్రజారోగ్య వేదిక, జేవీవీ నాయకులు

నెల్లూరు(క్రైమ్‌) : ఆక్యుపంచర్‌ పేరుతో నకిలీ వైద్యం చేస్తున్న ఏంగల్స్‌రాజా, అతని సిబ్బందిపై ఐదో నగర పోలీసులు గురువారం రాత్రి చీటింగ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. సుభాష్‌చంద్రబోస్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ దశయ్య ఐదేళ్లుగా టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. పలువురు వైద్యుల వద్ద చికిత్స చేయించుకోగా, మందులు వాడినంతసేపు ఆరోగ్యం సక్రమంగా ఉండేది. అనంతరం మళ్లీ అనారోగ్యానికి గురయ్యేవారు. ఈ నేపథ్యంలో అయ్యప్పగుడి ఫ్లయ్‌ ఓవర్‌ వద్ద ఏంగల్స్‌రాజా అన్ని రకాల వ్యాధులకు ఆక్యుపంచర్‌ వైద్యం చేస్తున్నారని కొందరు చెప్పడంతో ఈ ఏడాది జూన్‌లో అక్కడికి వెళ్లారు. ఏంగల్స్‌రాజాను కలిసి తన పరిస్థితిని వివరించగా, ఆయన దశయ్య వేలిపట్టుకొని నీ జబ్బు నయమైందని ఇక ఏ మాత్రలు మింగొద్దని సూచించారు. 12 వారాలు హాస్పిటల్‌కు వస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని చెప్పడంతో బాధితుడు హాస్పిటల్‌ చుట్టూ తిరగసాగారు. ఇటీవల దశయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో తిరిగి ఆక్యుపంచర్‌ హోమ్‌కు వెళ్లి వైద్యుడ్ని కలిసి తన ఆరోగ్యం గురించి ప్రశ్నించగా ఏంగల్స్‌రాజా అతడ్ని దుర్భాషలాడారు. సిబ్బంది పాండురంగనాయుడు, శేషాద్రి, జయకుమార్‌ కార్తికేయన్, మరికొందరు దశయ్యపై దౌర్జన్యం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏంగల్స్‌రాజా డాక్టర్‌ చదివినట్లు ఫోర్జరీ సర్టిఫికెట్లను చూపించి ఆక్యుపంచర్‌ పేరుతో మోసగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏంగల్స్‌రాజా అతని అనుచరులపై ఐదో నగర ఇన్‌స్పెక్టర్‌ మంగారావు చీటింగ్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్పీ రామకృష్ణ ఆరాతీశారు.

జేవీవీ నేతలతో వాగ్వాదం
నెల్లూరు(బారకాసు):
తన వైద్యంతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో జేవీవీ నాయకులు ఓ వైద్యుడిపై విరుచుకుపడ్డారు. నగరంలోని అయ్యప్పగుడి సమీపంలో గల ఫ్లయ్‌ ఓవర్‌ పక్కన ఉన్న  ఆక్యుపంచర్‌ కేంద్రాన్ని గురువారం ప్రజారోగ్య వేదిక, జేవీవీ నాయకులు పరిశీలించారు. అక్కడ వైద్యుడిగా వ్యవహరిస్తున్న  ఏంగల్స్‌రాజా నకిలీ వైద్యం చేస్తున్నారంటూ జేవీవీ నేతలు తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. దీంతో వైద్యుడికి సంబంధించిన వ్యక్తులతో పాటు అక్కడికి చికిత్స కోసం వచ్చిన వారు జేవీవీ నేతలతో వాగ్వాదానికి దిగారు. తోపులాటకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి  ఏంగల్స్‌రాజాను అదుపులోకి తీసుకొని ఐదో నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరో వైపు వైద్యుడి తీరు, చికిత్స చేస్తున్న విధానంపై జేవీవీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ రమణయ్య మాట్లాడారు.

కొంత మంది రోగులు సంబం ధిత వైద్యుడి వద్ద చూపించుకొని ఆయన సూచన మేరకు మందులు వాడుతూ మధ్యలో ఆపేసి  ఏంగల్స్‌రాజా వద్దకు వచ్చి నాడి వైద్యం చేయాలంటూ కొంత మొత్తాన్ని చెల్లించేవారన్నారు. తీరా ఆ రోగికి జబ్బు నయం కాకపోగా ఇంకా ఎక్కువైందని ఆరోపించారు. ఇలా అనేక మంది రోగులకు నకిలీ వైద్యం అందించి సొమ్ము చేసుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా,  ఏంగల్స్‌రాజా గుట్టును బయటపెట్టేందుకు తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. తమకు అనుమానం వచ్చి పరిశీలించగా  ఏంగల్స్‌రాజా చేస్తోంది నకిలీ వైద్యమని తేలిందని చెప్పారు. నకిలీ వైద్యం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్య వేదిక జిల్లా అ ధ్యక్షుడు డాక్టర్‌ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీని వాసరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు బుజ్జయ్య, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు