ప్రేమ, పెళ్లి పేరుతో మోసం

12 Jun, 2019 07:49 IST|Sakshi
యర్రంశెట్టి రమణగౌతం

నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ : ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి చేసుకుని రాత్రికిరాత్రే ఉడాయించిన నిందితుడిని బాధితురాలు పక్కా పథకం ప్రకారం పోలీసులకు పట్టించిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... వైజాగ్‌కు చెందిన యర్రంశెట్టి రమణగౌతం కూకట్‌పల్లిలో ఉంటూ టీవీ, సినిమా  రచయితగా పని చేస్తున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లోని ఎన్బీటీ నగర్‌కు చెందిన భవానీ అనే యువతిని ప్రేమించాడు. నాలుగగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తూ, ఆమె సంపాదన మొత్తం కాజేశాడు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఇవాళ రేపు అంటూ తప్పించుకునేవాడు. దీంతో బాధితురాలు రమణగౌతంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 1న  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బంజారాహిల్స్‌ పోలీసులు అతడిని స్టేషన్‌కు పిలిపించి పెళ్లి చేసుకోవాలని సూచించారు. అదే రోజు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్న అతను అదే రాత్రి ఉడాయించాడు. ఈ నెల 2న భవానీకి ఫోన్‌ చేసి నువ్వంటే ఇష్టంలేదు, విడాకులు తీసుకుందామని కోరాడు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. దాదాపు రూ. 8 లక్షలు దండుకొని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్‌ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్న రమణగౌతం పరారీలో ఉన్నాడు.

ఇటీవల ఓ లాయర్‌ను ఆశ్రయించి విడాకులు ఇప్పించాలని కోరడంతో సదరు లాయర్‌ బాధితురాలికి ఫోన్‌ చేసి విడాకులకు అంగీకరిస్తావా అంటూ అడిగాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో నిందితుడిని పట్టుకోవాలంటే విడాకులు అనే ఎర వేయాలంటూ సూచించాడు. విడాకులు ఇస్తానని నమ్మించి కాసేపు అక్కడే ఉంచాలని చెప్పారు. ఆమె మంగళవారం ఉదయం 12 గంటల సమయంలో నారాయణగూడలోని న్యాయవాది ఇంటికి వెళ్లి రమణ గౌంతంతో మాట్లాడుతుండగా బంజారాహిల్స్‌ కానిస్టేబుళ్లు అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు