యువతిని మోసగించిన ఉపాధ్యాయుడు

1 Mar, 2019 09:11 IST|Sakshi
ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్‌

ప్రేమ పేరుతో నయవంచన

పెళ్లికి మాత్రం నో.. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు

శ్రీకాకుళం, సంతబొమ్మాళి: ప్రేమ అంటూ యువతి వెంట పడడం, అనంతరం అవసరం తీర్చుకుని పెళ్లి చేసుకోను అనడం నేటి సమాజంలో పరిపాటిగా మారింది. ఇటువంటి పని ఏదో ఆకతాయి.. ఇంకొక వ్యక్తి చేసిన పని కాదు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధిని అవలంభించి యువతిని మోసం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... సంతబొమ్మాళి మండలానికి చెందిన యువతి, సారవకోటకు చెందిన దేశపాకల దుర్గాప్రసాద్‌ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2017 అక్టోబరులో బాధితురాలి అక్క పెళ్లిలో వీరి ఇరువురికీ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఫోన్‌లో చాటింగ్, సినిమాలకు కలిసి తిరిగారు. అంతేకాకుండా 2018 ఆగస్టు 25న దుర్గాప్రసాద్‌ పనిచేస్తున్న కంచిలి మండలం కోరికాన పుట్టుగ పాఠశాలకు యువతిని తీసుకు వెళ్లాడు. అక్కడ విద్యార్థులకు యువతిని ఉపాధ్యాయురాలని, గ్రామస్తులకు బంధువుల అమ్మాయి అని చెప్పి నమ్మించాడు. అదే రోజు రాత్రి తన ఉంటున్న రూమ్‌కి తీసుకు వెళ్లి, శారీరక అవసరాలను తీర్చుకున్నాడు.

ప్రస్తుతం పెళ్లి చేసుకోను అంటూ మోసగించాడని యువతీ వాపోయింది. దీనిపై సంతబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని, రూ.3 లక్షలు ఇస్తానని గ్రామస్తుల ద్వారా నిందితుడు రాయభారం నడిపాడు. అయితే... బాధితురాలు అందుకు ససేమిరా అనడంతో పాటు తనకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు