ఉద్యోగాల పేరిట టోకరా..

11 Feb, 2019 08:20 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న బాధితులు, గిరిజన సంఘ నాయకులు

సుమారు రూ. 25 లక్షలు వసూలు చేసిన మోసగాడు

నిందితుడ్ని పట్టుకున్న విద్యార్థి సంఘ నాయకులు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు

విజయనగరం ,కురుపాం: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని చెప్పి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ,  జియమ్మవలస మండలాల్లో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి సుమారు 25 లక్షల రూపాయల వరకు వసూళ్లుకు పాల్పడి వ్యక్తిని విద్యార్థి సంఘ నాయకులు పట్టుకున్నారు. బాధితులు ఆరిక సుశీల, బుజ్జి, అరుణకుమారి, ప్రసాద్‌తో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అశోక్,  గిరిజన సంఘ నాయకుడు గొర్లి తిరుపతిరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గాదాపు శివున్నాయుడు అనే వ్యక్తి తనకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుసునని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, వాచ్‌మన్, అటెండర్‌ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మబలికాడు.

నాలుగు మండలాల్లోని సుమారు 70 మందిని మోసం చేసి ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా మొత్తం సుమారు 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసి ముఖం చాటేశాడు. ఉద్యోగాల కోసం బాధితులు ఎన్నిసార్లు అడిగినా ఇదుగో..అదుగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో డబ్బులు ఇచ్చేయమని బాధితులు కోరినా పట్టించుకోలేదు. దీంతో బాధిత నిరుద్యోగులు ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘ నాయకుల దృష్టికి తీసుకురాగా.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులు కురుపాం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

చిన్న చిన్న దొంగతనాల నుంచి...
కొమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామానికి చెందిన గాదాపు శివున్నాయుడు పరిసర గ్రామాల్లో పశువులు దొంగతనం  చేసి జులాయిగా తిరిగేవాడు. ఈ మేరకు కొమరాడ పోలీస్‌ స్టేషన్‌లో ఇతనిపై పలు ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఇలా చిన్న చిన్న దొంగతనాల నుంచి లక్షల రూపాయాలు మోసం చేసి అమాయక గిరిజనులకు మోసం చేశాడు.

మరిన్ని వార్తలు