చీటీల పేరుతో మోసం

4 Jun, 2019 13:04 IST|Sakshi
డోన్‌ డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న బాధితులు(ఇన్‌సెట్‌) చీటీ డబ్బుతో ఉడాయించిన నిర్మలమ్మ (ఫైల్‌)

 రూ.11 కోట్లతో ఉడాయించిన మహిళ

డీఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు

డోన్‌: చీటీల పేరుతో ఓ మహిళ నిలువునా ముంచింది. డోన్‌ పట్టణంలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. చీటీల నిర్వాహకురాలు నిర్మలమ్మ ఇంటికి తాళం వేయడంతో పాటు సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి అదృశ్యం కావడంతో  బాధితులు లబోదిబోమంటూ డోన్‌ డీఎస్పీ ఖాధర్‌ బాషాను న్యాయం కోసం ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. డోన్‌ ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఈశ్వర్‌రెడ్డి భార్య నిర్మలమ్మ నెహ్రూనగర్‌లో నివాసముంటూ కొన్నేళ్లుగా చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు.

స్థానికులతో పాటు తరచుగా సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళుతూ అక్కడికి వచ్చే భక్తులతో కూడా పరిచయం పెంచుకొని చీటీల వ్యాపారం ప్రారంభించారు.  చీటీలు పాడిన వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోగా ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ వచ్చారు. నిర్మలమ్మ ఎంతో మంచి మనిషి అని భావించిన స్థానికులకు కొద్దిరోజుల్లో ఆమె నిజస్వరూపం తేటతెల్లమైంది. దీంతో చీటీల డబ్బుల కోసం ఆమెపై ఒత్తిడినిపెంచారు. దీంతో ఆమె చెప్పా చేయకుండా రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి ఉడాయించారు. ఆమె ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో బిత్తరపోయిన బాధితులు స్థానిక డీఎస్పీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు. నిర్మలమ్మ చేతిలో మోసపోయిన వారు 500 మంది దాకా ఉంటారని వీరందరికీ రూ.11కోట్ల వరకు నగదు చెల్లించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు