బంగారం పేరుతో టోకరా

9 Jul, 2020 09:23 IST|Sakshi
నకిలీ బంగారం బిస్కెట్స్‌

దొరికిన బిస్కెట్స్‌ అమ్ముతానని ఫోన్‌

ఆన్‌లైన్‌లో రూ.లక్షా 28 వేలు పంపిన వ్యక్తి  

మరికొన్ని డబ్బులు అడగటంతో అనుమానం

సినీ ఫక్కీలో పట్టుకొని పోలీసులకు అప్పగింత

సదరు వ్యక్తిపై కేసు నమోదు  

మనోహరాబాద్‌(తూప్రాన్‌): జేసీబీతో పనులు చేస్తుంటే బంగారం కడ్డీలు దొరికాయని తక్కువ ధరకు అమ్ముతానని నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని, కాళ్ళకల్‌కు రప్పించి చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన వైనం మనోహరాబాద్‌ మండలంలో బుధవారం చోటు చేసుకుంది.  ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... మనోహరాబాద్‌ మండలంలోని కాళ్ళకల్‌ గ్రామానికి చెందిన ఎర్రోళ్ళ నర్సింగ్‌రావుకు రిసాల్‌ అనే వ్యక్తి మూడు నెలల క్రితం ఫోన్‌ చేసి మాది హర్యానా రాష్ట్రం అని, జేసీబీ డ్రైవింగ్‌ చేస్తానని డ్రైవర్‌ జాబ్‌ కావాలని అడిగాడు, కాగా నర్సింగ్‌రావు వద్ద జేసీబీ లేదని తెలిపాడు. కానీ రెండు నెలలుగా ఫోన్‌ చేస్తూ ఎక్కడైనా సరే డ్రైవర్‌గా పెట్టించమని అడిగాడు.

నెల క్రితం అలాగే ఫోన్‌ చేసి నాకు ఓ పాత ఇంటిలో జేసీబీతో పనులు చేస్తుంటే  బంగారం బిస్కెట్స్‌ దొరికాయని, నాకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమని, వీటిని అమ్ముతానని బంగారం ఫొటోలను నర్సింగ్‌రావు ఫోన్‌కు పంపించాడు. దీన్ని నమ్మి విడతల వారిగా ఆన్‌లైన్‌లో రూ.లక్షా 28 వేలు పంపాడు. కాగా ఇంకా డబ్బులు కావాలని ఫోన్‌ చేయడంతో, అనుమానం వచ్చి మిగతా డబ్బులు బంగారం చూపితేనే ఇస్తానని చెప్పి అతడిని చాకచక్యంగా కాళ్ళకల్‌ గ్రామంలో బంగారమ్మ దేవాలయం వద్దకు రప్పించాడు. 

నర్సింగ్‌రావుకు బంగారం బిస్కెట్స్‌ మాదిరి బిల్లలు ఇవ్వగా అనుమానం వచ్చి వాటిని చెక్‌ చేయించగా అది బంగారం కాదని నకిలీదని తెలింది. వెంటనే అతడిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించినట్టు ఎస్‌ఐ రాజు  తెలిపారు.  అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నర్సింగ్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విచారణ చేసి అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు