టూరిస్టు వీసాపై తీసుకెళ్లి తరిమేశారు..

30 Mar, 2018 08:15 IST|Sakshi
నిందితుడు సుధీర్‌కుమార్‌

విదేశీ ఉద్యోగం పేరుతో టోకరా

ముగ్గురు నగర వాసుల నుంచి రూ.7 లక్షలు స్వాహా

నిందితుడి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: క్వికర్‌లో కనిపించిన ఓ యాడ్‌ ముగ్గురు నగరవాసులను నిండా ముంచింది. అజార్‌బైజాన్‌ దేశంలో ఉద్యోగం పేరుతో టూరిస్ట్‌ వీసాపై తీసుకువెళ్లిన మోసగాళ్లు నెల తర్వాత తరిమేశారు. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన ఓ వ్యక్తి చేతిలో రూ.7.15 లక్షలు మోసపోయిన బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు సుధీర్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి గురువారం తెలిపాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అక్బర్‌ అలీ ఖాన్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేసి తన కుటుంబానికి చేదోడువాదోడుగా మారాలని భావించిన అతను తన ఆలోచనను స్నేహితులైన ఇమ్రోజ్‌ ఖాన్, షేక్‌ మినాజ్‌లకు చెప్పాడు. ముగ్గురూ కలిసి విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనే ఆశతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ క్వికర్‌ ద్వారా అన్వేషించారు. ఈ నేపథ్యంలో  పట్నాకు చెందిన సుధీర్‌కుమార్‌ అలియాస్‌ రాజేష్‌కుమార్‌ ఇచ్చిన ప్రకటన వీరిని ఆకర్షించింది. అజార్‌బైజాన్‌ దేశంలో అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయని, భారత కరెన్సీలో నెలకు కనీసం రూ.లక్ష జీతం వస్తుందంటూ అందులో పేర్కొన్న సుధీర్‌ తన ఫోన్‌ నెంబర్‌ సైతం పొందుపరిచాడు.

దీంతో ఈ ముగ్గురూ ఆ నెంబర్‌లో సంప్రదించగా... రిజిస్ట్రేషన్‌ చార్జీల నిమిత్తం రూ.15 వేలు తమ ఖాతాల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు పూర్తి వివరాలు పంపాలని కోరాడు. దీంతో ఈ త్రయం ఆ మొత్తం డిపాజిట్‌ చేసి, వివరాలు పంపిన కొన్ని రోజులకే టూరిస్ట్‌ వీసాలు వీరి చిరునామాలకు పంపాడు. ఈ వీసాలను చూసిన ముగ్గురూ పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల వల్లో పడిపోయారు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభించిన నేరగాళ్లు ఇతర చార్జీల కింద ఒక్కొక్కరు రూ.1.5 లక్షల చొప్పున చెల్లించాలని చెప్పాడు. అయితే బేరసారాల తర్వాత ముగ్గురూ కలిసి రూ.3.5 లక్షలు చెల్లించారు. దీంతో వీరికి విమాన టిక్కెట్లు పంపిన సైబర్‌ నేరగాడు సుధీర్‌ అజార్‌బైజాన్‌ వెళ్లిన తర్వాత అక్కడ తమ భాగస్వామి సమీర్‌ కలుస్తాడని, అతడికి ఒక్కొక్కరు 2 వేల డాలర్ల చొప్పున చెల్లించిన తర్వాతే జాబ్‌ వీసా, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తాడని సుధీర్‌ చెప్పాడు. మూడేళ్ల వర్క్‌ పర్మిట్‌ ఉంటుందని నమ్మబలికాడు. అప్పటికే వీసా, విమాన టిక్కెట్ల అందడంతో ఈ ముగ్గురూ పూర్తిగా సైబర్‌ నేరగాడి మాయలో పడిపోయారు.

గతేడాది డిసెంబర్‌లో ఆ దేశం వెళ్లిన ఈ ముగ్గురినీ విమానాశ్రయంలో రిసీవ్‌ చేసుకున్న సమీర్‌కు సంబంధించిన వ్యక్తి ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకువెళ్లాడు. మొత్తం ఆరు వేల డాలర్లు చెల్లించిన తర్వాత దాదాపు నెల పాటు అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంచి ఆహారం అందించారు. ఆపై హఠాత్తుగా మీ టూరిస్ట్‌ వీసా గడువు ముగుస్తోందని చెప్పిన సమీర్‌ తక్షణం స్వదేశం వెళ్లకపోతే ఇక్కడి పోలీసులు జైల్లో పెడతారని, అంత తేలిగ్గా బెయిల్‌ సైతం లభించదని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక సిటీకి తిరిగి వచ్చిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుడు వాడిన ఫోన్‌ నెంబర్, బ్యాంకు ఖాతా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పట్నా వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సుధీర్‌కుమార్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇతను అక్కడ ఎస్‌వీఎస్‌ ఇంటర్నేషనల్‌ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు