నమ్మించారు.. డబ్బు కొట్టేశారు

15 Jan, 2019 13:34 IST|Sakshi
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదుతో సీఐ, ఎస్సైలు, సిబ్బంది

అక్షయపాత్ర ఉందంటూ మోసం

ముఠా సభ్యులే కొనుగోలుదారులుగా నటించిన వైనం

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

రూ.51 లక్షలు స్వాధీనం  

నెల్లూరు, గూడూరు: అక్షయపాత్ర ఉందంటూ ముగ్గురు వ్యక్తులను నలుగురు సభ్యుల ముఠా ట్రాప్‌ చేసింది. వారి నుంచి నగదు కొట్టేసేందుకు నిందితుల్లో ఇద్దరు కొనుగోలుదారులుగా నటించారు. డమ్మీ పోలీసులను పిలిపించి డ్రామా ఆడారు. ఇద్దరు నగదుతో పరారు కావడం.. నగదు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. దీంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

సోమవారం స్థానిక రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌  సీఐ వంశీధర్‌ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన రమేష్, విజయనగరానికి చెందిన దేవుడుబాబు అలియాస్‌ సూరిబాబు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం బహదూర్‌పేట గ్రామానికి చెందిన వికాస్, అదే మండలం కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుభాష్‌లు సులువుగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ వద్ద ఎంతో మహిమ గల అక్షయపాత్ర ఉందని, దీనిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తే రూ.కోట్లు వస్తుందని ఎవరినైనా నమ్మించి భారీ మొత్తంలో నగదు సంపాదించాలనే పథకం రచించారు. అక్షయపాత్రను కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత ఉన్న వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. రమేష్‌కు నెల్లూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎం.ప్రసాద్‌రెడ్డి సోదరుడితో పరిచయమైంది. రమేష్‌ అతనితో మాటల సందర్భంలో విజయనగరానికి చెందిన దేవుడుబాబు వద్ద రూ.కోట్లు విలువ చేసే అక్షయపాత్ర ఉందని, దానిని కొనుగోలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ విషయం సోదరుడి ద్వారా ప్రసాద్‌రెడ్డికి తెలిసింది. అయితే అతనికి గతంలోనే శ్రీకాళహస్తి చెందిన వికాస్, సుభాష్‌లతో పరిచయం ఉంది. కాగా ప్రసాద్‌రెడ్డికి రమేష్‌కు, వికాస్‌లకు పరిచయం ఉన్నట్లు తెలియదు. అలాగే వారు కూడా తమకు పరిచయం లేనట్లే ప్రవర్తించారు.

మహిమలు తెలుసని..
ఈ నేపథ్యంలో రమేష్‌ ప్రసాద్‌రెడ్డిని కలిసి ‘తనకు అక్షయపాత్ర మహిమల గురించి బాగా తెలుసు. తాను చేసే పరీక్షల్లో మహిమలు ఉన్నట్లుగా నిర్ధారణ అయితేనే కొనుగోలు చేద్దామని నమ్మించాడు. దేవుడుబాబు వద్ద ఉన్న అక్షయపాత్రలో ఉండాల్సిన మోతాదు కంటే కూడా ఎక్కువ పవర్‌ ఉంది. దానిని రసాయనాలతో శుద్ధి చేయాలి. అందుకు పెద్దమొత్తంలో నగదు కావాలని చెప్పాడు. దీంతో ప్రసాద్‌రెడ్డి తన స్నేహితుడైన హైదరాబాద్‌కు చెందిన కోళ్ల శేషగిరి అనే వ్యక్తికి విషయం చెప్పాడు. అతను సుమారు రూ.కోటి విడతలవారీగా వారికి అందజేశాడు. మళ్లీ వారు అక్షయపాత్రను కొనుగోలు చేసేందుకు రూ.కోటి అవసరమని చెప్పారు. అయితే శేషగిరి తన వద్ద అంతమొత్తం లేదని, కొంత మొత్తం మాత్రమే తీసుకురాగలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌రెడ్డి తనకు పరిచయం ఉన్న చిల్లకూరు మండలానికి చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తికి ఈ విషయాన్ని వివరించాడు. ఈ మేరకు అందరూ కలిసి నగదు తీసుకెళ్లి ఆ అక్షయపాత్రను తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

నమ్మించేందుకు నగదు తెచ్చారు
ప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్, శేషగిరిని నమ్మించేందుకు రమేష్, వికాస్‌ కూడా నగదు సిద్ధం చేశారు. రమేష్‌ రూ.24 లక్షలు, వికాస్‌ రూ.10 లక్షలు, శేషగిరి రూ.23 లక్షలు, ప్రవీణ్‌ రూ.30 లక్షలు తీసుకుని గతేడాది డిసెంబర్‌ 20వ తేదీన అందరూ కలిసి విజయనగరానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రసాద్‌రెడ్డి, ప్రవీణ్, శేషగిరి అక్షయపాత్రను చూడాలని కోరారు. రమేష్‌ కల్పించుకుని దానిని చూస్తే పవర్‌ పోతుందని నమ్మించాడు. వారంతా తమ వెంట తీసుకెళ్లిన రూ.87 లక్షలను దేవుడుబాబుకు అందజేశారు. అతను అక్షయపాత్ర ఖరీదు రూ.90 లక్షలని చెప్పాడు. దీంతో రమేష్‌ రూ.3 లక్షలు తాను వైజాగ్‌లో ఇస్తానని చెప్పాడు. అందరూ కలిసి కారులో వైజాగ్‌కు బయలుదేరారు.

నకిలీ పోలీసులను పెట్టి..
నిందితులు నగదు తీసుకుని పారిపోయేందుకు నకిలీ పోలీసులను ఏర్పాటు చేశారు. వారు ఓ చోట కారును ఆపి తనిఖీ చేస్తున్నట్లు నటిస్తుండగా దేవుడుబాబు, వికాస్‌లు నగదు తీసుకుని పరారయ్యారు. దీంతో ప్రసాద్‌రెడ్డి, శేషగిరి, ప్రవీణ్‌లకు అనుమానం వచ్చింది. వారు వెంటనే చిల్లకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్సై బాబీ, హెడ్‌ కానిస్టేబుల్‌ చిరంజీవులు, కానిస్టేబుళ్లు నరేష్, భాస్కర్, ఆదినారాయణ, మాధవరావులు సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు అందిన సమాచారంతో శ్రీకాళహస్త్రిలోని మిట్టకండ్రిగ వద్ద వికాస్, సుభాష్‌లను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో రూ.25 లక్షలను బాధితుని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారని సీఐ వంశీ«ధర్‌ తెలిపారు. దేవుడుబాబు, రమేష్‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు