మేల్‌ ఎస్కార్ట్స్‌ పేరుతో మోసం

11 Mar, 2020 08:30 IST|Sakshi

తొలుత అవకాశం ఇస్తామంటూ ఎర

ఆపై పోలీసుల పేరు చెబుతూ టోకరా

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వ్యాపారికి మేల్‌ ఎస్కార్ట్‌గా అవకాశం కల్పిస్తామంటూ ఫోన్‌ చేసిన నేరగాళ్లు అతడి నుంచి డబ్బు వసూలు చేశారు. ఓ దశలో పోలీసులకు సమాచారం ఇస్తామంటూ చెప్పి బెదిరించారు. మొత్తమ్మీద రూ.3 లక్షలకుపైగా సైబర్‌ క్రిమినల్స్‌కు ‘సమర్పించుకున్న’ బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ మండల పరిధిలోని కార్వాన్‌కు చెందిన వ్యాపారికి శనివారం ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆయనతో మాట్లాడిన గుర్తుతెలియని మహిళ  ‘ఆల్‌ ఇండియా ఎస్కార్ట్స్‌ సర్వీసెస్‌’ నుంచి మాట్లాడుతున్నామని, ఓ ఆఫర్‌ మీకు ఇస్తున్నామని చెప్పింది. తమ వద్ద కేవలం రూ.1070 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని, ఆపై మేల్‌ ఎస్కార్ట్స్‌గా అవకాశ కల్పిస్తూ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించుకునేందుకు సహకరిస్తామని ఎర వేసింది. దీనికి ఆకర్షితుడైన సదరు వ్యాపారి ఆ యువతి సూచించినట్లే డబ్బును ఓ ఖాతాలోకి బదిలీ చేశారు. మర్నాడు మరోసారి ఫోన్‌ చేసిన మహిళ మేల్‌ ఎస్టార్ట్‌గా మా సంస్థ నుంచి గుర్తింపు కార్డు తయారు చేసి అందించాల్సి ఉందని చెప్పింది. దాని కోసం మరో రూ.18,700 చేయాలని చెప్పింది.

ఈ మొత్తం చెల్లింపు విషయంలో వ్యాపారి ఆలోచనలో పడగా.. ఈ డబ్బులో కేవలం రూ.700 మాత్రమే చార్జిగా తీసుకుంటామని, మిగిలింది రిఫండబుల్‌ అంటూ మహిళ చెప్పింది. దీంతో వారి వల్లో పడిన వ్యాపారి ఆ మొత్తాన్నీ వారు సూచించిన విధంగా డిపాజిట్‌ చేశారు. ఈ డబ్బు అందుకున్న సైబర్‌ నేరగాళ్ళు ఆధార్‌కార్డు సహా మరికొన్ని పంపాల్సిందిగా కోరి వాట్సాప్‌ చేయించుకున్నారు. ఆపై కొత్త నాటకానికి తెరలేపారు. మళ్లీ వ్యాపారికి కాల్‌ చేసిన మహిళ ఫోన్‌లో మీరు చెప్పిన దాని ప్రకారం వయసు 38 ఏళ్లు కాగా.. ఆధార్‌ కార్డు ప్రకారం 39గా ఉందని పేర్కొంది. ఈ కారణంగానే ఆన్‌లైన్‌లో గుర్తింపు కార్డు తయారు కావట్లేదని నమ్మబలికింది. దీంతో అడ్వాన్డ్స్‌ ఐడీ కార్డు తయారు చేయడానికి మరో రూ.18,700 డిపాజిట్‌ చేయాలని.. వీటిలో రూ.18 వేలు తిరిగి చెల్లిస్తామని ఎర వేసింది. ఇది నమ్మిన వ్యాపారి మరో రూ.18,700 జమ చేశాడు. మరోసారి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు తమ సంస్థతో లీగల్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉందని వ్యాపారికి చెప్పారు. దీనికోసం అంటూ రూ.43,500 డిపాజిట్‌ చేయించారు. చివరగా మేల్‌ ఎస్కార్ట్‌ పోస్టుకు పోలీస్‌ వెరిఫికేషన్‌ చేయించాల్సి ఉందని, దానికోసం రూ. 75 వేలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ మొత్తం డిపాజిట్‌ చేయడానికి వ్యాపారి వెనుకాడటంతో... మేము కోరినట్లు డబ్బు చెల్లించకపోతే మీ స్థానిక పోలీసుస్టేషన్‌కు ఈ సమాచారం ఇస్తామంటూ బెదిరించారు. మొత్తమ్మీద వివిధ పేర్లు చెప్పిన సైబర్‌ నేరగాళ్ళు వ్యాపారి నుంచి రూ.3,06,970 వసూలు చేశారు. అంతటితో ఆగన ఆ నేరగాళ్ళు మరికొంత గుంజాలని ప్రయత్నాలు చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు